Take a fresh look at your lifestyle.

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు-మీడియాతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

అందుకే ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలు
పార్టీలకతీతంగా నారీ శక్తి వందన్ ను స్వాగతించండి
మహిళలకు 33 రిజర్వేషన్ కల్పనకు కేంద్రం చిత్తశుద్ధి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు 33 రిజర్వేషన్ కల్పించాలనే చిత్తశుద్ధితో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. 2029 సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా ఎవరు చేయని పని ప్రధాని మోడీ చేస్తున్నారని కితాబిచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బిల్లు అమలు చేసినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యులు పార్టీలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దతు తెలపాలని, 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఒక సాధారణ బిల్లు కాదన్న డీకే అరుణ… కోట్లాది మంది ఆడబిడ్డల ఆశయమని చెప్పారు. కేంద్రం అమలు చేయనున్న ఈ బిల్లు రాజకీయాల్లో కొత్త నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయితే.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత.. పార్లమెంట్ స్థానాలు 17 స్థానాల నుంచి 26 స్థానాలకు పెరుగుతాయని అరుణ చెప్పారు అందులో 9 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉంటారన్నారు. 273 మంది మహిళలు దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కి వస్తారన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 180కి పెరుగుతాయనీ అందులో 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చునే అవకాశం దక్కుతుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ చట్టసభల్లో పెద్ద సంఖ్యలో మహిళల ప్రతినిధ్యం పెరుగుతుందన్న డీకే అరుణ.. దేశ రాజకీయాల్లోకి మహిళలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. గతంలో వంటింటికి పరిమితమైన మహిళలు.. అనేక రంగాలలో వచ్చిన అవకాశాలను తన శక్తిని నిరూపించుకుందన్నారు. దేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయని వివరించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు అడుగులు వేయగలుగుతామన్న డీకే అరుణ ఒక తల్లిగా కుటుంబాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడంలో సమర్ధవంతంగా, చక్కగా వ్యవహరిస్తూ ప్రతి మహిళ ముందుకు వెళ్తోందన్నారు. చట్ట సభలో మహిళల సంఖ్య పెరిగితే మహిళా ఆర్థిక, ఉపాధి, రక్షణలలో కీలక మార్పులు వస్తాయని చెప్పారు. అనేక మంది మహిళలు రాజకీయాల్లో తమ నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారన్న ఆమె.. ఏ రంగంలో అయినా రాణించగలం అని రుజువు చేస్తున్నారన్నారు.. 40 ఏళ్లుగా మహిళా సాధికారత అని ప్రగల్భాలు పలుకుతోన్న కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని అనేక మంది కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.

పేద కుటుంబాల్లో గుణాత్మక మార్పు..
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని సర్కార్ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారని డీకే అరుణ అన్నారు.. స్వచ్ భారత కింద 12వేల కోట్ల ఇండ్లకు టాయిలెట్స్ నిర్మాణం, పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, జన్ ధన్ యోజన, స్టార్టాప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ముద్ర రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. వికాసిత్ భారత్ 2027 లక్ష్యం తో ముందుకు వెళ్తున్నామన్న ఆమె.. దేశ జీడీపీ పెరుగుతుందని అంటే.. మహిళల భాగస్వామ్యం కీలకం అన్నారు. మహిళా శక్తి కి రాజకీయ శక్తి తోడైతే.. గ్రామీణ ప్రాంతాల్లో,రైతు, పేద కుటుంబాల్లో గుణాత్మక మార్పు వస్తుందని అబిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాలి అంటే.. మహిళాల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. మహిళలను విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ అన్నింటిలో ప్రోత్సాహకం కల్పిస్తున్నట్టు చెప్పారు. గర్భిణీ, బాలింతల కు పోషకాహారం, క్యాన్సర్ బారిన కడకుండా.. వాక్సినేషన్ బాలికలకు అందిస్తున్నట్లు వివరించారు. బీజేపీకి పేరువస్తుందని.. ప్రత్యర్థులు కుళ్ళు బుద్ధితో ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహిళలకు డ్రోన్ ట్రైనింగ్, స్టాండప్ ఇండియా కింద ప్రోత్సహిస్తుందనీ దీదీ లక్పతి పథకం ఇలా అనేక పథకాలతో ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో కేసీఆర్ మాదిరి ఉత్తర, దక్షిణ రాష్ట్రాలని.. మాట్లాడారో అలాగే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.