2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అశాస్త్రీయం
సామాజిక మార్పున కు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి
దక్షిణాది రాష్ట్రాలను బలహీన పర్చేందుకు కేంద్రం కుట్ర
ద్రవిడ రాష్ట్రాలకు పన్నుల రూపంలో వచ్చే వాటాను తగ్గించింది
రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకికరణ ప్రయత్నం జరుగుతుంది
బహుజనులు ఏకమై ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
బీసీ సబ్ ప్లాన్ అంశంపై ఆలోచన చేస్తాం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర వద్ద పెండింగ్లో ఉంది
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కుల గణన చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ లెక్కలు పరిగణలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రవీంద్ర భారతి తో మహాత్మా పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే పరిగణలో తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిపారు.

కుల గణన చేయకుండా నియోజకవర్గాల విభజన చేపడితే ఫలితం మరోరకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నాయని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. ద్రవిడ రాష్ట్రాలను బలహీన పరిచేందుకు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో భారీగా తగ్గింపులు చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపేనా ఒక రూపాయి కేంద్రానికి వెళితే తిరిగి రాష్ట్రానికి 37 పైసలు మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి 29 పైసలు, కేరళ నుంచి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి 61 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. అదే ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్ నుంచి కేంద్రానికి రూపాయి వెళితే తిరిగి కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి 6.53 రూపాయలు వెళుతున్నాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూపాయి వెళితే తిరిగి ఆ రాష్ట్రానికి పన్నుల వాటాల రూపంలో 2.17 రూపాయలు వెళుతున్నాయని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల జరుగుతున్న వివక్ష, కేంద్రం ఉద్యమాలను కట్టడి చేస్తున్న తీరు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

నియోజకవర్గాల పునర్విభజనలో కుల గణన ను పరిగణలోకి తీసుకోకపోతే యావత్ భారత దేశంలోని బలహీన వర్గాలకు నష్టం జరుగుతుందని, మనకోసం మనం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజా ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రజలే కేంద్రంగా నిధులు కేటాయించిందన్నారు. ఇదే జరిగితే తమకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని భావించి రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకికరణ ప్రయత్నం జరుగుతుందని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
బీసీ సబ్ ప్లాన్ పై ఆలోచన చేస్తున్నాం
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ అమల్లోకి తీసుకువచ్చిందన్న భట్టి విక్రమార్క బీసీ సబ్ ప్లాన్ అమలుపై వచ్చిన డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. బీసీ సబ్ ప్లాన్ అమలుకు ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. అంతరాలు లేని సమాజం కోసం జనాభా ఆధారంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేసినప్పుడే సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉందన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నిటారుగా నిలబడుతుందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే కుల సర్వే చేపడతామని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల సర్వే చేసి రాష్ట్రంలో 56శాతం మంది బీసీలు ఉన్నారని తమ ప్రభుత్వం లెక్క కట్టి చెప్పిందన్నారు. వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కుల సర్వే చేశారు ఆ తర్వాత దేశంలో కుల సర్వే చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కుల సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపామనీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపగా అక్కడ బిల్లు పెండింగ్ లో ఉందని తెలిపారు. కేంద్రం ఆమోదించి పంపితే కుల సర్వే ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం సామాజిక స్పృహతో పాలన అందిస్తుందని భట్టి స్పష్టం చేశారు. ఏ చిన్న అవకాశం దక్కిన, ప్రతి సందర్భంలో పూర్తిస్థాయిలో మహాత్మ పూలే ఆలోచనలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మార్పు కోసం మనం అంతా నడుం బిగించి అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని వినియోగించుకోవాలి అన్నారు. అంతరాలు లేని సమాజం విద్యుత్ ద్వారానే సాధ్యమని చెప్పారు. అందుకోసం చిన్ననాటి నుంచే పునాదులు వేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓసి అన్ని వర్గాల పిల్లలు 12వ తరగతి వరకు ఒకే చోట చదువుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే 40 శాతం డైట్, 200శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. ఎవరు అర్ధాకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిరోజు నాణ్యమైన డైట్ ను అందించడంతో పాటు వాటిని పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్రటరీ నుంచి మండల స్థాయి అధికారి వరకు సీఎం నుంచి సర్పంచి వరకు గురుకులాలు సంక్షేమ వసతి గృహాలు సందర్శించాలని నిబంధన పెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. అవసరమైతే అక్కడే నిద్రించాలని నిబంధన పెట్టి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నట్టు వివరించారు. మరోవైపు జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం పథకం ప్రారంభిస్తున్నామనీ ప్రతి నియోజకవర్గంలో రూ.15 కోట్లతో సకల సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంటేనే అంతరాలు లేని సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన ప్రజా ప్రభుత్వం తాజా బడ్జెట్లో విద్యాశాఖకు 13.5శాతం నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు. కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.