ముద్ర ప్రతినిధి, నిర్మల్:
దేశాభివృద్ధిలో జనగణన పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. భారత జనాభా గణన – 2027 కు సంబంధించి అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జనగణన ప్రక్రియ కీలక భూమిక పోషిస్తుందన్నారు. అధికారులు చేపట్టే జనగణన ఆధారంగానే ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యే పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రజా ప్రయోజనాల రూపకల్పన జరుగు తుందన్నారు. దేశాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే జనాభా గణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జనగణన ప్రక్రియకు సంబంధించి గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో తప్పులకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్లు అందించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని వివరించారు. ఎటువంటి సందేహాలు ఉన్నా మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. జనగణన ప్రక్రియను బాధ్యతగా నిర్వర్తించి, విజయవంతం చేయాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు అధికారులకు జనగణనకు సంబంధించి అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, జడ్పీ సీఈవో శంకర్,ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.