ముద్ర కాప్రా
దేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రిజర్వేషన్ల పరిరక్షణ వంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నది అని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మారుపాక అనిల్ కుమార్ అన్నారు.
దళిత హక్కుల పోరాట సమితి మేడ్చల్ జిల్లా సమావేశం ఈసీఎల్ లోన్ని సీపీఐ జిల్లా కార్యాలయంలో చిలుముల మల్లేశంఅధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ హాజరై మాట్లాడుతూ దళితులపై దాడులు, అగ్రకుల పెత్తందారుల దౌర్జన్యాలు పెరుగుతున్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగవంతం కావడంతో రిజర్వేషన్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇది దళిత యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో దళితుల కోసం కేటాయింపులు సరైన స్థాయిలో లేవు. విద్య, ఉపాధి, భూమి పంపిణీ, గృహ నిర్మాణం, ఆరోగ్య సేవల వంటి కీలక రంగాలలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో దళితుల జీవన పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. నిరుద్యోగం, విద్య, వైద్య,భూమి సమస్యలు తీవ్రమవుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, భూ హక్కులు, విద్యా హక్కుల కోసం దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలను ఉదృతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు ఏకమై పోరాట బాట పట్టాలి అని ఆయన పిలుపనిచ్చారు. దళిత హక్కుల పోరాట సమితి రెండవ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 17 18 తేదీల్లో వరంగల్ నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దండు రమేష్ దర్శన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు