ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, తగ్గిన గ్యాస్ సరఫరాతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు సతమతవుతున్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణమని సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్ ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపు, కొరత కు నిరసనగా నిర్మల్ లో ప్రదర్శన నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాల గ్యాస్ ధరలు రూ.60కి పెరిగాయన్నారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని పరిస్థితి చూస్తే తెలుస్తుందన్నారు. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలకు ఇబ్బందులు, హోటళ్ల మూతకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణమన్నారు. గతంలో మనకు రష్యా నుంచి సబ్సిడీ ధరకు చౌకగా లభిస్తున్న చమురును అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం వదులు కుందన్నారు. ఇది పూర్తిగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. గతంలో ఆలీనోద్యమానికి రూపకర్తగా ప్రపంచ వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారతదేశ విదేశాంగ విధానం ఇపుడు అమెరికా కనుసన్నల్లో నడిచే దుస్థితి ఏర్పడడం అత్యంత విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి, రాజేశ్వర్, పుండలిక్, ముత్యం, నారాయణ, శివకుమార్, నజీర్, అనంతరావు, ప్రజా సంఘ నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధాన్ని ఆపాలని,ప్రపంచ శాంతిని పరిరక్షించాలని, భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని చాటాలని విజ్ఞప్తి చేస్తున్నాం.