వికారాబాద్, ముద్ర విలేకరి : కామ్రేడ్ జార్జి రెడ్డి స్ఫూర్తితో విద్యా రంగంలో మనోవాద భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్ లు అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పి డి ఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జార్జిరెడ్డి 53వ వర్ధంతి విజయవంతం చేయాలని స్థానిక గెస్ట్ హౌస్ లో శనివారం పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 వ దశకంలో కామ్రేడ్ జార్జ్ ఇచ్చిన సమర నినాదం జీ నా హై తో మార్నా సీఖో.. కదం కదం ఫర్ లడ్న సీఖో..సూటిగా చెప్పాలంటే ఆచరణ ,జ్ఞానం, పోరాటం, త్యాగం ,నిజాయితీ, విలువలు,సాహసం వీటన్నింటి సమహారమే జార్జి అని అన్నారు.జార్జి ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్ సంస్థను స్థాపించి మనువాద శక్తుల ఆరాచకపు ఆధిపత్యాన్ని ఎదిరించి అణగారిన వర్గాల విద్యార్థులకు బిగి పిడికిలి జెండాను అందించాడని ఉన్నారు. క్యాంపస్ లో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేశాడని తెలిపారు. ఫ్రెంచ్ విద్యార్థుల తిరుగుబాటు వియత్నం విప్లవ పోరాటాలు,శ్రీకాకుళం, నక్సలబరి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల ప్రభావంతో జార్జి విప్లవ పంథా ను ఎంచుకున్నాడని అన్నారు. విప్లవాల అనుభవాలను అధ్యయనం చేసి ఆచరణలోకి తీసుకురావాలనుకున్నాడని తెలిపారు.తద్వారా దేశంలో దోపిడీ సమాజాన్ని కూల్చి సమానత్వ సమాజాన్ని నిర్మించాలనుకున్నాడని అన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్య కాషాయి కరణ వైపు వేగంగా అడుగులు వేస్తున్నదని అన్నారు. 21(8) అధికరణం ప్రకారంగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏ సంస్థలో నైనా మత బోధనలు చేయరాదని రాజ్యాంగం తెలియజేస్తుందని తెలిపారు.జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా ఆయన అమరత్వాన్ని విషాద జ్ఞాపకం గా కాకుండా మరో పోరాటం ఉత్తేజంగా తలుచుకుంటూ ఏప్రిల్ 10 నుండి 14 వరకు జార్జి ప్రసంగికత నేటి విద్యార్థులకు వివరిస్తూ విద్యలో మనువాద.భావజాలాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా సభ్యులు సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.