బోథ్, ముద్ర:
గిరిజన సంస్కృతిని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం జామిడి గ్రామంలో జరిగిన 9వ ఇప్ప పువ్వు పండుగ, అనాథ పిల్లల సంక్షేమ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ఆర్థిక వ్యవస్థలో ఇప్ప పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని, దీనిని శాస్త్రీయ పద్ధతిలో సేకరించి విక్రయించడం ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇటువంటి ఉత్సవాలు గిరిజన సంస్కృతిని భావితరాలకు అందిస్తాయని పేర్కొంటూ, ఐటిడిఎ ద్వారా రైతులకు, స్వయం సహాయక సంఘాలకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డీసీపీయూ సర్వే – చట్టబద్ధమైన దత్తత” అవగాహన కల్పిస్తూ, జిల్లాలోని అనాథలు, వీధి బాలలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా, కేవలం సీఏఆర్ఏ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, అనధికారిక దత్తత చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరించారు. పిల్లలకు కుటుంబ ప్రేమానురాగాలను అందించడానికి ‘ఫోస్టర్ కేర్’ (తాత్కాలిక పెంపకం) పద్ధతిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా పిల్లల విద్యా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని వెల్లడించారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు కనిపిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీఓ మంద మకరంద్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం గాదిగూడ మండలంలోని పిప్రి (కొలంగూడ) గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న పలు ఇళ్లను స్వయంగా సందర్శించిన కలెక్టర్ పనుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నిర్మాణ ప్రక్రియలో ఎక్కడా నాణ్యత లోపించకూడదని, ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ లబ్ధిదారులకు తగిన సూచనలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా బిల్లుల చెల్లింపు విషయంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే దశల వారీగా ఎంబీ రికార్డు చేసి, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కాలనీలలో కేవలం గృహ నిర్మాణమే కాకుండా, విద్యుత్, తాగునీరు, మురుగునీటి కాలువల వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, లబ్ధిదారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.