Take a fresh look at your lifestyle.

కులగణన ముసాయిదా సిద్ధం 

  •  రాష్ట్రంలో సమగ్రసర్వే సక్సెస్​
  • పూర్తయిన సర్వే డాటా ఎంట్రీ
  • వచ్చే నెల 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక
  • సమీక్షలో సీఎంకు వివరించిన అధికారులు
  • సర్వే దేశం దృష్టిని ఆకర్శించిందన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

ముద్ర, తెలంగాణ బ్యూరో :  రాష్ట్రంలో సమగ్ర సర్వే పూర్తయింది. కులగణన ముసాయిదా సిద్ధమైంది. సర్వేలో తేలిన అంశాలపై అధ్యయనం, కసరత్తు పూర్తి చేసిన ఉన్నతాధికారులు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే సర్వే డేటా ఎంట్రీ  పూర్తయింది. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే వచ్చే నెల రెండో తేదిన మంత్రివర్గ ఉపసంఘానికి తుది నివేదిక ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డికి వివరించారు. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు,ఉద్యోగులను సీఎం అభినందించారు.ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే చేపట్టి తమ చిత్తశుద్ధి చాటుకున్నామన్న ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన  బీసీ డెడికేటేడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా  1.16 కోట్ల కుటుంబాలు…

గతేడాది నవంబర్ 6న రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే) మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం అధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహా యజ్ఞంలో ఎన్యుమరేటర్లు, సూపర్​ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు పాలుపంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేలో గుర్తించారు. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించారు.దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం,కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాలుపంచుకోలేదదని అధికారులు సీఎం కు వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క,మంత్రులు  దామోదర రాజనర్సింహ,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్క,పొంగులేటి శ్రీనివాస రెడ్డి,ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు,మాజీ మంత్రి జానారెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.