- డిజిటల్ ట్రేడింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలు
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
ముద్ర, తెలంగాణ బ్యూరో : డిజిటల్ ట్రేడింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఓ బ్యాంక్ మేనేజర్, పలువురు బ్యాంక్ ఉద్యోగులు సహా మొత్తం 52 మందిని అరెస్టు చేయడం గమనార్హం. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరాలను వెల్లడించారు.. పట్టుబడిన నిందితులు మూడు రకాల సైబర్ నేరాలకు, మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా చెక్ బుక్ లు, సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఫేస్ బుక్ బ్రౌడింగ్, వాట్సప్ గ్రూప్స్ ద్వారా అమాయకులను నిందితులు ఆకర్షిస్తూ, ట్రేడింగ్ పేరుతో రూ.93 లక్షలను సైబర్ నేరగాళ్ళు కాజేశారని తెలిపారు.
బాధితులను లక్ష్యంగా చేసుకుని మ్యూడ్ ఖాతాలను తెరిపించి, పలువురు బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. ఆన్ లైన్ పెట్టుబడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, యాప్స్, వాట్సప్ గ్రూప్ లలో చేరవద్దని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సైబరా నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగివుండం ముఖ్యమని అన్నారు. చదువుకున్న వారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కకోవడం జరుగుతుందన్నారు. గతేడాదిలో రూ.3,500 కోట్లు సైబర్ నేరాలు జరగ్గా, అందులో కేవలం 13 శాతం మాత్రమే రికవరీ చేశామన్నారు. సైబర్ కేసులో నగదు రికవరీ కష్టతరంగా మారిందన్నారు. అలాగే ఈ కేసుల్లో నిందితులు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు చెందినవారు కావడంతో దర్యాప్తు కూడా ఆలస్యమవుతోందని ఆయన వెల్లడించారు.