- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.
- పెద్దపెల్లి జిల్లాలో నూతనంగా 4 వేల 467 కుటుంబాలకు రేషన్ కార్డ్ జారీ.
- జిల్లా ఆసుపత్రిలో ఆధునిక సాంకేతికత క్లిష్టమైన సర్జరీలు విజయవంతంగా నిర్వహణ.
- అంగరంగ వైభవంగా అవతరణ వేడుకలు.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: తెలంగాణను దేశంలో అగ్ర స్థానంలో నిలిపేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ రూపకల్పన చేసి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు.కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి,జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరం తన సందేశాన్ని ఇచ్చారు.ఆడబిడ్డలు సంతోషంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు మహిళలకు 139 కోట్ల 40 లక్షల రూపాయలు ఆదా అయ్యాయన్నారు. గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీ పై రూ.500 కే ప్రజా ప్రభుత్వం సరఫరా చేస్తుంది, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 17 వేల 856 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సబ్సీడిపై సరఫరా చేసి సంబంధిత లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో 14 కోట్ల 3 లక్షల రూపాయలు సబ్సీడీ సోమ్ము జమ చేశామన్నారు. గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోబడి విద్యుత్ వినియోగిస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుంది.జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థలకు 74 కోట్ల 23 లక్షల రూపాయలను ఈ పథకం కింద చెల్లించి 1,31,187 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద జిల్లాలో మహిళా సంఘాల చే 27 స్టిచ్చింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తులను కుట్టిస్తున్నామని, 4 క్యాంటీన్, మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లెట్లు ఏర్పాటు చేశామని, రెండు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన లాంటి వివిధ కార్యక్రమాల అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు.యాసంగి సీజన్ నుంచి పెట్టుబడి సహాయాన్ని 12 వేల రూపాయలకు పెంచి జిల్లాలో 1,21,698 మంది రైతుల ఖాతాలో 88 కోట్ల 86 లక్షల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసామన్నారు.మార్చి, ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన 3,556 ఎకరాలకు పదివేల చొప్పున పరిహారం జమ చేఅయినట్లు తెలిపారు. యాసంగి సీజన్ లో 50,108 మంది రైతుల వద్ద నుండి రూ.812 కోట్ల విలువ గల 3,51,616 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తుందని తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటను 2,923 ఎకరాలలో సాగు చేస్తున్న 1104 మంది రైతులకు కోటి 85 లక్షల సబ్సిడీ అందించామన్నారు.రామగుండం నగర కార్పొరేషన్ పరిధిలో గత సంవత్సరం రూ.58.43 కోట్లు, పెద్దపల్లి పట్టణంలో రూ.10 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. చందంపల్లి రాంపల్లి వద్ద నిర్మించిన డబ్బులు బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి 163 కొత్త వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, జిల్లాలో 24 వేల 285 మంది రోగులకు 57 కోట్ల 84 లక్షల రూపాయల విలువ గల శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించామన్నారు.పెద్దపెల్లి జిల్లా ఆసుపత్రిలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.31 మంది పసిపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా పూర్తి చేశామని, నూతనంగా సైకాలజిస్ట్ డెంటల్ ఆడియో లాజిస్టిక్ కంటి శస్త్ర చికిత్సకు సంబంధించిన విభాగాలను ప్రారంభించి మెరుగైన సేవలు అందిస్తున్నామని, 2డి ఏకో సేవలు ప్రారంభించామని, 20 పడకలతో నవజాత శిశువుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.15.81 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ది పనులు పూర్తి చేశామని తెలిపారు.రాబోయే విద్యా సంవత్సరంలో ఏఐ టూల్స్, ఐ.ఎఫ్.పి ప్యానల్స్ ద్వారా విద్యార్థులకు బోధించుటకు జిల్లాలోని 2,724 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించామని, వేసవి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించి 3500 పైగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరిగేందుకు కృషి చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ, బీసి లకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద ప్రస్తుతం సంవత్సరం జిల్లాలోని 3,549 మంది ఎస్సీ విద్యార్థులకు 3 కోట్ల 6 లక్షల రూపాయలు, 310 మంది ఎస్టీ విద్యార్థులకు 85 లక్షలు, 21,882 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు 31 కోట్ల 98 లక్షలకు పైగా నిధులను విడుదల చేశామని అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్లు పంపిణీ చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. గత ఏడాది 611 మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లాలో 41 కోట్ల పెట్టుబడితో 53 వ్యాపార యూనిట్ లకు అనుమతులు మంజూరు చేసామని, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం క్రింద రూ.3 కోట్ల సబ్సిడీతో 51 యూనిట్ లను మంజూరు చేశామని, టీ – ప్రైడ్, టీ – ఐడియా క్రింద 84 సేవా రంగ, తయారీ రంగ పరిశ్రమలకు 7 కోట్ల 68 లక్షల సబ్సిడీ రిలీజ్ చేసిందన్నారు.అనంతరం ముఖ్య అతిథి జిల్లాలో రైతులకు దయచేసి నా వరి వంగడాలను (విత్తనాలను) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మహిళ కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కటారి రేవతి రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ. అన్నయ్య గౌడ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, అదనపు కలెక్టర్లు జె .అరుణశ్రీ, డి.వేణు, డి.సి.పి. కరుణాకర్, ఆర్.డి.ఓ. బి.గంగయ్య, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
