తడిసిన ధాన్యం పరిశీలించిన మంత్రి జూపల్లి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాశులను ఆయన నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని కూడా గోదాములకు తరలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి ఊహించిన దానికంటే అధికంగా రావడంతో గోదాముల కొరత ఏర్పడిందన్నారు. సమస్య పరిష్కారానికి కాటన్ గోదాములు, ప్రైవేట్ గోదాములతో పాటు అవసరమైన చోట ఫంక్షన్ హాళ్లను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు.
ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని మంత్రి విమర్శించారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే అధిక ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.
హమాలీల కొరత, ఆర్థిక ఇబ్బందులు, గోదాముల సమస్యలు ఉన్నప్పటికీ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.