మహదేవపూర్, ముద్ర: ప్రతి విద్యార్థి కూడా టాపరేనని ఎవరూ తక్కువకాదని బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాదించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జంగేడు కేజీబీవీ పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో అన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.10వ తరగతి పరీక్షలకు ఇంకా 9 రోజులు మాత్రమే సమయం ఉందని పేర్కొంటూ, విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహించి పరీక్షలపై భయం తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు పరీక్షలు అంటే బయపడొద్దని ధైర్యంగా వ్రాయాలని కోరారు. జంగేడు కేజీబీవీ పాఠశాలలోని 6వ, 10వ తరగతులు మరియు ఇంటర్ తరగతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. వసతి గృహంలో నిత్యావసర వస్తువుల నిల్వలు, భోజనశాల, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, డైనింగ్ హాలు, ఆర్ ఓ ప్లాంట్ పరిశీలించారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ధైర్యం చెప్పారు.అనంతరం సైన్స్, ఎలక్ట్రానిక్ మెషిన్ ల్యాబ్‌ను పరిశీలించారు. ప్రహరీ నిర్మాణ పనులు వేగవంతం చేపించాలని డీఈఓకు సూచించారు. ఆయనతోపాటు ఆర్డీఓ హరికృష్ణ, డీఈఓ రాజేందర్, ఎస్‌ఓ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
