Take a fresh look at your lifestyle.

“ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్” నిర్వహణ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి : జిల్లా క్రీడల అధికారి సీతారాం నాయక్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద “ఆరోగ్య తెలంగాణ” కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నాగర్ కర్నూల్ పట్టణంలో “ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ అధికారి సీతారాం నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ 2కే రన్ కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమై కేసరి సముద్రం ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, నిత్య వ్యాయామం మరియు శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, యువతి యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు తెలిపారు.

ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన జీవన విధానం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇవ్వనున్నట్లు సీతారాం నాయక్ వెల్లడించారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అలాగే ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.