Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందే

  • లేకపోతే ముఖ్యమంత్రి పదవికే కళంకం
  • రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులు అర్హులందరికీ అందలేదు
  • ఈ నాలుగు పథకాలు అర్హులకు అందకపోవడం దారుణం
  • సీఎం రేవంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికే కళంకం అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రులు ప్రజలకు ఒక మాట ఇచ్చారంటే అదే శాసనంగా అమలయ్యేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎంగా రేవంత్ రెడ్డి హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం హామీలనే అమలు చేయలేకపోతే, మీ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీ తనంతో పనిచేయగలరు? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం హామీలు అమలు కాలేదంటే దేశం దృష్టిలో తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే అని పేర్కొన్నారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను బండి సంజయ్ రాశారు.

రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులు ఉన్నారని, అయితే ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటి? అని ప్రశ్నించారు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42 వేల 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదమని, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటు అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా నేటికీ నయాపైసా ఖర్చు చేయకపోవడం దారుణమన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందని, తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద, రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరును యధాతథంగా కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.