Take a fresh look at your lifestyle.

సైకిల్ ఎక్కిన బీర్ల…. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే

27 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర..
ముద్ర, యాదగిరిగుట్ట :

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైకిల్ ఎక్కారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సోమవారం ఉదయం 6 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాదాల వద్ద నుంచి కొలనుపాక సోమేశ్వర ఆలయం వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర నిర్వహించారు.
ఈ సైకిల్ యాత్రలో భాగంగా యాదగిరిపల్లి, వంగపల్లి, రామాజీపేట, పెద్ద కందుకూరు, చిన్న కందుకూరు, బాహుపేట, తదితర గ్రామాల మీదుగా ప్రయాణిస్తూ ఆలేరు మార్కెట్ యార్డు, కొలనుపాక సహా మొత్తం తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం కొనుగోలు పరిస్థితులు, రవాణా సమస్యలు, హమాలీల కొరత, లారీల అందుబాటు వంటి అంశాలపై ఆరా తీశారు.
కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో జాప్యం ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెంటనే తొమ్మిది కొనుగోలు కేంద్రాలకు లారీలు సమకూర్చి ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..
అలాగే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా వచ్చే నెల రోజుల పాటు ఆలేరు నియోజకవర్గ పర్యటనల్లో అధికార వాహనం, ఎస్కార్ట్ వాహనాలను వినియోగించకుండా కేవలం ఎలక్ట్రిక్ స్కూటీల ద్వారానే ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.