ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
హైదరాబాదులో ఈనెల 10వ తేదీన జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వివరిస్తూ, త్వరలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
దళితుల పక్షపాతి నరేంద్ర మోడీ అని, భారత ప్రధానిగా మూడవసారి ఎన్నికైన తర్వాత తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోడీ, సుమారు రూ. 8వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. దళిత సంక్షేమం, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోందని, కాంగ్రెస్ ఎన్నడూ అంబేద్కర్ను గౌరవించలేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే అంబేద్కర్ గౌరవార్థం పంచతీర్థాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు చేయూతను అందించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా దళిత విద్యార్థులకు విదేశీ విద్య కోసం అండగా ఉంటున్నామని తెలిపారు. తెలంగాణలోని 59 దళిత కులాలు ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే ఎంపీ అరవింద్ ఎల్లప్పుడూ మోడీ నిర్ణయాలకు లోబడే పనిచేస్తున్నారని, బండి సంజయ్‌ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. కేసీఆర్ తీరుపై విమర్శలు వచ్చినప్పుడు నోరు మెదపని వారు, బీజేపీ నేతలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని రానున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే రాష్ట్ర పాలన సాగడం లేదని, జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలకు కేంద్రం నుండి భారీగా నిధులు వచ్చాయని గుర్తుచేశారు. పసుపు బోర్డుకు ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ రీజియన్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయించారని కొనియాడారు. అలాగే కేంద్ర విద్యాలయంపై ఆటంకాలు ఏర్పడుతున్నాయని, చలిగల్‌లో కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్థలం కేటాయించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.అనూప్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జంబర్తి దివాకర్, ఎస్సైఆర్ జిల్లా కన్వీనర్ డా. పుప్పాల శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పిండేరు భానుప్రియ , సీనియర్ నాయకులు రాగిలా సత్యనారాయణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.