Take a fresh look at your lifestyle.

పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

  • రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
  • ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పకడ్బందీ నిఘా
  • డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు
  • 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
  • పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కెమెరా లేదా వెబ్ క్యాస్టింగ్
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్లతో వీడియో సమావేశం

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ వేణు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం,ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని,క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడుల నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులకు సూచించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని, పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు తనిఖీ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని,అక్కడ సీసీ కెమెరాలు లేదా నిరంతరాయంగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు.జిల్లాలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన మేర పోలింగ్ సామాగ్రి, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు,పోస్టల్ బాక్స్ అదేవిధంగా చూడాలని,వీటి తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు అందించాలని ఆయన తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 7.30 మాక్ పోలింగ్ నిర్వహించాలని,సరిగా 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని,ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలకు తీసుకొని రావాలని,పోలీస్ భద్రతతో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించి అవసరమైన శిక్షణ అందించామన్నారు.ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు కరీంనగర్ తో సమన్వయం చేసుకుంటూ అందుబాటులో పెట్టుకున్నామన్నారు.పోలింగ్ ముగిసిన తర్వాత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ సామాగ్రి కరీంనగర్ కు తరలించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు రిపోర్ట్ అందించేలా వ్యవస్థ సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో ఎస్.డి.సి. శ్రీరాములు, కలెక్టరేట్ సూపరెండెంట్ విజయ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.