ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం హామీల ఎగవేత డిక్లరేషన్‌గా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంది తప్పితే.. అభివృద్ధికి సంబంధించిన దిశా దశ లేదని ఎద్దేవా చేశారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ‘‘అప్పుల కుప్పలా రాష్ట్రం ఉంటే మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని భ్రమలు కల్పిస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమో చెప్పాలి. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 5 శాతం పడిపోయాయి. ఆర్థిక క్రమక్షణ లేని.. అప్పుల జాతర రాష్ట్రంలో నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన రైతుల పట్ల యమపాశంగా మారింది. ఉత్తర తెలంగాణలో జరిగిన పంట నష్టానికి పరిహారం ఇంత వరకూ ఇవ్వలేదు. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు’’ అని అన్నారు.