Take a fresh look at your lifestyle.

గద్వాల రాజకీయం గందరగోళం

………………………………………
– ఎమ్మెల్యే బండ్ల, కాంగ్రెస్ జిల్లా ఇంచార్జి సరిత రాజకీయ రచ్చ
– ఇంతకాలం కాంగ్రెస్ కు సేవాలందించిన సరిత, బీ ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల
– బండ్ల చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సరిత వర్గం
– ఎమ్మెల్యే గా అనర్హత వేటుపడుతుందని బీ ఆర్ ఎస్ లో ఉన్నానని ఎమ్మెల్యే ప్రకటన
– ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే
– కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే కు మద్దతు ఇవ్వడంతో అలకబూనిన సరిత
– గందరగోళం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు… రోజు రోజుకు హీట్ ఎక్కుతున్న గద్వాల రాజకీయం
………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
గద్వాల లో మున్సిపల్ రాజకీయం రోజు రోజు కు వేడెక్కుతోంది. ఎప్పటి నుంచో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత మధ్య రాజకీయ వివాదం రాజుకొంటోంది.ప్రస్తుతం జరుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. వీరిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరి వైపు ఉండాలో ఎటు తేల్చుకోలేక పోతున్నారు. ఎమ్మెల్యే బండ్ల బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. తరువాత పార్టీ మారిన ఎమ్మెల్యే లపై బీ ఆర్ పార్టీ కోర్టు తలుపు తట్టింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే లు అనర్హత వేటు పడుతుందని బీ ఆర్ ఎస్ లోనే ఉన్నామని కొందరు ఎమ్మెల్యే లు ప్రకటించారు. ఇందులో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.కానీ ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరపున చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా బండ్ల వైపే మొగ్గుచూపింది. అధిక మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు బండ్ల వర్గీయులకే కేటాయించింది.దీంతో సరిత వర్గం కాంగ్రెస్ అధిష్టానం పై కన్నెర్ర చేసింది. బండ్ల తీరు పై మండిపడుతూ ఏఐసీసీ కి ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి మార్పు జరగలేదు. వారు కూడా బండ్ల కే మద్దతు పలకడం తో సరిత కు దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. తప్పని స్థితి లో ఇచ్చిన కొన్ని మున్సిపల్ స్థానాలతో సరిపెట్టుకుని అరకొర గా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యే బండ్ల మాత్రం కేటాయించిన మున్సిపల్ స్థానాల అభ్యర్థుల తరపున ప్రచారం లో ముందున్నారు. బీ ఆర్ ఎస్ అని ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థుల కు ప్రచారం చేయడం సిగ్గుచేటని సరిత ఆరోపిస్తోంది.
తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ లైన్‌కు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేస్తున్నానని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని సరిత అంటున్నారు. రాష్ట్రమంతా ఒక రకమైన రాజకీయాలు ఉంటే గద్వాలలో మాత్రం రాజకీయ వ్యభిచారం నడుస్తోందని సరిత ధ్వజమెత్తుతున్నారు.
తనపై నమ్మకం ఉంచుకున్న అభ్యర్థులందరినీ గెలిపించుకుంటానని, వారికి పూర్తి అండగా ఉంటానని సరిత భరోసా కల్పిస్తున్నారు.​ఒక బహుజన బిడ్డను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న శక్తులపై, వారి కుయుక్తులపై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు సరిత అంటున్నారు.పూటకో మాట మారుస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల అసలు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆమె విమర్శలు చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీని ఎవరు కాపాడారో రాష్ట్ర నాయకత్వానికి పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు.
ఎమ్మెల్యే బండ్ల మాత్రం సరిత వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు.
………………………………….
ఇద్దరికీ సవాల్ గా మారిన మున్సిపల్ ఎన్నికలు :
…………………………………….
ఏ ఎన్నికలు వచ్చినా గద్వాల రాజకీయం రసవత్తరంగా.. రంజుగా సాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రణరంగాన్ని తలపించే విధంగా జరుగుతున్నాయి. మొత్తం 37 మున్సిపల్ కౌన్సిల్ వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో జనరల్ స్థానాలు 9 కాగా జనరల్ మహిళలకు 10 స్థానాలు కేటాయించారు. బీసీ జనరల్ కు 7, బీసీ మహిళలకు 6, ఎస్సి జనరల్ కు 2, ఎస్సి మహిళలకు 2, ఎస్టీ జనరల్ కి ఒక స్థానం రిజర్వు అయ్యాయి.
ఇందులో అత్యధికంగా ఎమ్మెల్యే బండ్ల వర్గానికి టిక్కెట్లు రావడం తో సరిత వర్గం వారు ఇచ్చిన స్థానాలతో సరిపెట్టుకుని ప్రచారం పెద్ద గా చేయడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా గద్వాల రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Leave A Reply

Your email address will not be published.