భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై అసత్య ఆరోపణలు
రైతులు, ఎగుమతి దారుల్లో భయాందోళనలు సృష్టించే కుట్ర
నిరాశ, నిస్పృహలతో దిక్కుతోచని స్థితిలో ఈ వ్యాఖ్యలు
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రైతులు, ఎగుమతి దారుల్లో అనవసర భయాందోళనలు కలిగించేందుకు చేసిన కుటిల ప్రయత్నమేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నెగిటివ్ రాజకీయాల ద్వారా దేశ పురోగతిని వెనక్కి లాగేందుకు రాహుల్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలకు విరుద్ధంగా అన్నదాతలు, ఎగుమతిదారులను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అంగీకరించరన్నారు. ఇప్పటివరకు వరుసగా వంద ఎన్నికల్లో పరాజయాల తర్వాత రాహుల్ గాంధీ నిరాశ, నిస్పృహలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తనకు ఉన్న వ్యతిరేకతను దేశంపై వ్యతిరేకతగా మలచుకున్నారని విమర్శించారు. 11 ఏళ్లుగా దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, అధికారం దక్కదన్న అసహనంతో దేశంలో అన్నదాతలను, ఎగుమతిదారులను రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వీటిని కూడా తిప్పికొడతారన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం ట్వీట్ చేశారు.
రూ.45 లక్షల కోట్ల టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు
ప్రస్తుతం భారత్ రూ.4 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తోందని 38 అభివృద్ధి చెందిన దేశాల పరిధిలోని 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా రూ.45 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు ఏర్పడ్డాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తోందన్న కేంద్రమంత్రి… ఇందులో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పేరుతో డెవలప్ అవుతోందన్నారు. అమెరికా, ఇతర దేశాలతో కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా ఎగుమతులు గణనీయంగా పెరిగి, వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. దీంతో తెలంగాణకు కూడా పెద్ద మొత్తంలో లబ్ధిచేకూరనుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందడం, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదా? అని ప్రశ్నిచారు.
పత్తి రైతులకు ఆందోళన అక్కర్లేదు:
రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులను, పత్తి డిమాండ్ తగ్గుతుందని రైతులను ఆందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. భారత వస్త్ర పరిశ్రమ రంగంలో విస్తారమైన వృద్ధి అవకాశాలు ఉన్నందున భారత పత్తికి డిమాండ్ నిరంతరం పెరుగుతుందని చెప్పారు. దీంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. భారతీయ పత్తి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అనేక అంశాల్లో రాజీపడిన సంగతి మనందరికీ తెలుసని 2013లో బాలీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశంలో ధాన్యం, పత్తిపై కనీస మద్దతు ధర వ్యవస్థను 2017 నాటికి రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు.