మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇల్లు

ఇంట్లోకి వెళుతున్న పోలీసులు
ముద్ర, బండ్లగూడ: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే…. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గత శుక్రవారం ఫలితాల రోజు రోహిత్ రెడ్డి తన అనుచరులతో హంగామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బి ఆర్ ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుక్రవారం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న మీడియా పాయింట్ లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో తనను కూడా లోపలికి వెళ్ళనివ్వాలని రోహిత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంలో ఓ పోలీస్ అధికారిని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోసేసారు. ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు ఆదివారం సాయంత్రం మణికొండలోని రోహిత్ రెడ్డి ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు పోలీసులు రోహిత్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ఆయన కోసం వెతికారు. రోహిత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో వారు వెనుతిరి గారు. అధికారులు తిరిగి వెళ్లినా సిబ్బందిని ఆయన ఇంటి వద్ద ఉంచారు. రోహిత్ రెడ్డి ఏ క్షణంలో ఇంటికి వచ్చిన అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పోలీసులు అతిగా ప్రవర్తించడమే కాకుండా వీడియోలు తీస్తున్న తమ సెల్ ఫోన్లను కూడా లాక్కున్నారని ఆయన కుటుంబ సభ్యులు, అక్కడికి చేరుకున్న నాయకులు ఆరోపిస్తున్నారు.