పైశాచిక కాంగ్రెస్
ప్రజలను మోసం చేసి పాలన
పోలీసుల అడ్గగింతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల మండిపాటు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘ఆరు గ్యారెంటీలను’ రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. హామీల అమలు కోరుతూ బీజేపీ చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, గతంలో కేసీఆర్ పాలన కంటే దారుణమైన నిర్బంధం ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కనిపిస్తోందని విమర్శించారు. ఇదే పద్ధతి అవలంబించిన బీఆర్ఎస్‌ను ప్రజలు గద్దె దించారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, చేస్తున్న ఖర్చులకు అస్సలు పొంతన లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ. 2500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు వంటి ఆకర్షణీయమైన హామీలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాంటి అరెస్టులకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.