ముద్ర, నారాయణ పేట :
జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్, మిల్లుల వద్ద లారీల అన్లోడింగ్ జాప్యం జరుగుతున్నదని తమ దృష్టికి వచ్చిందని, రెండు రోజుల్లో కేంద్రాల్లో ఉంచిన ధాన్యం బస్తాల లోడింగ్ పూర్తి కావాలని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ తో కలిసి జిల్లాలోని మద్దూరు, పల్లెగడ్డ తండా, దొరేపల్లి, గుండుమాల్, అమ్లికుంట పీ ఏ సి ఎస్, ఐ కే పీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మద్దూరు కొనుగోలు కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ ఇంతవరకు కేంద్రంలో ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేశారని? ఇంకా ఎన్ని బస్తాల ధాన్యం విక్రయానికి వస్తుందని ? ప్రస్తుతం కేంద్రంలో ఎన్ని బస్తాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఇప్పటివరకు 13 వేల బస్తాలు కొనుగోలు చేశామని, ఇంకో 10 వేల బస్తాలు విక్రయానికి వచ్చే అవకాశం ఉందని, కేంద్రంలో ప్రస్తుతం 5 వేల బస్తాలున్నాయని, లారీల కొరత కారణంగా లోడింగ్ నిలిచి పోయిందని కేంద్రం ఇన్ ఛార్జ్ కలెక్టర్ కు వివరించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆర్ టీ వో కి ఫోన్ చేసి మాట్లాడి, వెంటనే మద్దూరు, గుండుమాల్, కోస్గి మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను లోడింగ్ చేసేందుకు వాహనాలను ( లారీలు) తెప్పించాలని ఆదేశించారు. పల్లెగడ్డ తాండ కు చెందిన ఐకేపీ కేంద్రానికి వెళ్లి ధాన్యం కుప్పలను చూసి తేమ శాతాన్ని, ప్యాడీ క్లీనర్ ను పరిశీలించారు. ఆ కేంద్రంలో నిల్వ ఉన్న బస్తాలను లోడింగ్ చేసేందుకు 4 లారీలు కావాలని నిర్వాహకులు కలెక్టర్ ను కోరగా, లారీలు సమకూర్చి బుధవారం సాయంత్రం వరకు ధాన్యం బస్తాలను లోడింగ్ చేయించాలని సివిల్ సప్లై అధికారి సైదులు కు సూచించారు. అనంతరం దొరేపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం బస్తాల తుకాన్ని చెక్ చేశారు. కేంద్రంలో నిల్వ ఉన్న బస్తాలను అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించాలని ఆమె తెలిపారు. కొనుగోలు కేంద్రంలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. ఆ తర్వాత గుండుమాల్ వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ఎంత మంది రైతులకు ధాన్యం డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయని కేంద్రం ఇన్ ఛార్జ్ ని ప్రశ్నించగా 70 మంది రైతులకు డబ్బులు పడ్డాయని ఇన్ ఛార్జ్ కలెక్టర్ కు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేయాలని చెప్పారు. కేంద్రంలో టార్ఫా లైన్లను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కోస్గి మండలం కడెం పల్లి మహా లక్ష్మి రైస్ మిల్లును సందర్శించారు. మిల్లు యజమానితో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన దాన్యం బస్తాలను ఆన్ లోడింగ్ చేయించాలన్నారు. మిల్లుకొచ్చిన లారీలు వెంటనే అన్లోడ్ చేసుకుని తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని ఆదేశించారు. అవసరమైతే హమాలీలను ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకొని అన్లోడ్ ను పెంచాలన్నారు. రానున్న 10 రోజులు జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, ప్రత్యేకించి ప్రభుత్వ కేంద్రాల ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ ,రెవెన్యూ, ఆర్టీవో, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో కొనుగోళ్లు సజావుగా జరిగేలా, ధాన్యం బస్తాల లోడింగ్, అలాగే రైస్ మిల్లులకు వెళ్లిన లారీల్లోనీ బస్తాలను ఆన్ లోడింగ్ చేసే వరకు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని, రెండు రోజుల పాటు ఆయా మండలాల లోనే అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రాల్లో లోడింగ్, మిల్లుల వద్ద ఆన్ లోడింగ్ చేసే ఫోటోలను ఎప్పటికప్పుడు తనకు పంపించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. చివరగా గుండుమాల్ మండలం అమ్లికుంట కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన 1500 బస్తాలు లోడింగ్ చేసేందుకు వాహనాలు రావడం లేదని అమ్లికుంట నుంచి బొగారాం వెళ్ళే దారి ఇరుకుగా ఉన్నందున పెద్ద వాహనాలు( లారీలు) రావడం కష్టమని, ట్రాక్టర్ల ద్వారా బస్తాలను లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలని రైతులు కలెక్టర్ ను కోరారు.