ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
వచ్చే ఏడాది ప్రభుత్వ బడుల్లో 10శాతం అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం
ముద్ర ప్రతినిధి,సూర్యపేట:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి విద్యా విజయోత్సవం సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడా (స్పోర్ట్స్) విభాగాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ప్రతి విభాగంలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ. 10,000 నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి, భవిష్యత్తులో వచ్చే ఆధునిక అవకాశాలను అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో కూడిన పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు పాఠశాల విద్యాశాఖను కలెక్టర్ అభినందించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరానికి గానూ ‘బడిబాట’ కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 శాతం కొత్త అడ్మిషన్లను పెంచేలా ఉపాధ్యాయులందరూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించు కోవాలని ఆదేశించారు.
ఈ విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కే. అశోక్, డీఐఈవో సులోచన రాణి, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, సూర్యనారాయణ, పూలన్, రిటైర్డ్ ప్రధానో పాధ్యాయులు వనమాల వెంకటేశ్వర్లుతో పాటు వివిధ మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.