Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ కు దుఃఖం వస్తుంది

  • ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షలు.
  • ఏజన్సీ నియోజక వర్గాలకు ఎక్కువ ఇళ్ళు ఇచ్చేందుకు సీఎం అంగీకారం.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడ లేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దుఃఖం వస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇటీవల వరంగల్లులో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే దుఃఖం వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు.ఆ దుఃఖం తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఉద్యోగం పీకినందుకు వస్తుందని ఎద్దేవా చేశారు.బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, భద్రాచలం నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే వాటి అసలు, మిత్తి చెల్లిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నామని చెప్పారు. పేదోడి సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. పూరి గుడిసెల్లో ఉంటూ పేదోడు కంటున్న కలలను నెర వేర్చే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుందన్నారు.అందులో భాగంగా, అధికారంలోకి వచ్చిన15,16 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కేవలం లక్ష, లక్షన్నర ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయని, ఆ లక్ష రూపాయలతో ఇళ్లు కట్టు కోవడం కుదరదని భావించి, పేదోడి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం రూ.ఐదు లక్షలు ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా, రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇళ్లు పేదలకు నిర్మించి ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నామని, ఏజన్సీ ప్రాంతాల్లో నియోజక వర్గాలకు అంతకన్నా ఎక్కువ ఇళ్ళు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు.మొదటి విడతలో ఇళ్లు రాలేదని నిరుత్సాహ పడాల్సిన పని లేదని, రెండు, మూడో విడతల్లో వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే, మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం, ఉచిత కరెంట్, పంట రుణమాఫీ, రైతు బంధు, మొదటి ఏడాదిలోనే నిరుద్యోగులకు 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంతే కాకుండా దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సన్న బియ్యాన్ని రేషన్ షాప్ ల ద్వారా ఉచితంగా అందిస్తున్న ఘనత కూడా ఇందిరమ్మ ప్రభుత్వానికె దక్కుతుందన్నారు. అలాగే, జూన్ 2న రాజీవ్ యువ వికాస్ పథకం క్రింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.6 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరుగుతుందన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.. సన్న బియ్యం లబ్దిదారుని ఇంట భోజనం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక మండలంలోని గొట్టెల్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు.చర్ల మండలంలోని సుబ్బంపేట గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు వాసం ముసలయ్య ఇంట్లో భోజనం చేశారు.చర్ల గ్రామంలోని లక్ష్మీ కాలనీలో కోటి16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.వాజేడు మండలంలోని నాగారం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.