- పరారైన ఉద్యోగులు, ఏజెంట్లు
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: అవినీతికి నిలయంగా మారిన రవాణా శాఖ చెక్ పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిత్యం ఏదో ఒక చోట దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా భిక్కనూరు మండలంలోని పొందుర్తి ఆర్టీవో చెక్ పోస్ట్ లో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. దాడుల సందర్భంగా ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒకరిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం. దాడులు జరుగుతున్న సమాచారం తెలుసుకున్న ఆర్టిఏ ఏజెంట్లు తమ కార్యాలయాలను మూసి ఉంచారు.ఏసీబీ అధికారుల దాడులతో ఈ చెక్ పోస్ట్ లో పనిచేసే ఆర్టీవో అధికారుల అసిస్టెంట్లు పరారైనట్టు తెలిసింది. ఆర్టీఏ కార్యాలయం వద్ద కూడా ఏజెంట్లు పారిపోయారు.మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లే లారీల వద్ద చెక్ పోస్ట్ అధికారులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై ఏసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ ను వివరణ కోరగా పొందుర్తి చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేస్తున్నామని చెప్పారు. వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.కాగా, గత నెలలో మద్నూర్ మండలం సలాబత్ పూర్ అంతర్రాష్ట చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈదాడుల్లో రూ.1.20 లక్షలను అధికారులు సీజ్ చేశారు.