ఆకుపచ్చ పరదాల చాటున కొనసాగుతున్న అక్రమ నిర్మాణ పనులు
ఇజ్జత్ నగర్ లో యధేచ్ఛగా ‘ముఠా’ అక్రమాలు
మాదపూర్ లో మున్సిపల్ అధికారుల ‘మాయ’
ముద్ర, శేరిలింగంపల్లి:
సిగ్గు…సిగ్గు…అధికారులు ఒకటి చేస్తే…ఆక్రమణ దారులు మరొకటి. అధికారులు నోటీసు బోర్డు అంటిస్తే…దాని కిందే టు-లెట్ బోర్డు. పనులు ఆపేస్తే మరుసటి రోజే పనులు కొనాసాగింపు. ఇలా మూడు నెలల కాలంలో భవనమే పూర్తి చేశారు. దర్జాగా అద్దె బోర్డు తగిలించారు ఆక్రమణ దారులు…ఇది ఎక్కడో కాదు స్వయాన మాదాపూర్ సీఎంసీ కార్యాలయం సమీపంలోనే. దీని మర్మమేమి చెప్పండి మున్సిపల్ అధికారులారా…? గత మూడు నెలల క్రితమే ఆక్రమణలు గుర్తించి స్థానికులు ఫిర్యాదు చేస్తే.. అధికారులు నోటీసు ఇచ్చినా ఆక్రమణ దారులు స్పందించరు.

రెండవ నోటీసుకూ ఉలుకూ…పలుకూ ఉండదు. ఈ లోగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉంటాయి. కొంచం చొరవ, ధైర్యం చేసి అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేస్తూ బోర్డు తగిలిస్తే…మరుసటి రోజు నుండే పనులు కొనసాగింపు. పనులు కొనసాగుతున్న విషయాన్ని ఫిర్యాదు దారుల ద్వార తెలుసుకున్న మున్సిపల్ అధికారులు పనిముట్లను స్వాదీన పరుచుకున్నా పనులు ఆగవు. కొసమెరుపు ఏంటంటే.. ఆకుపచ్చ పరదా పైన మున్సిపల్ అధికారుల సీజ్ బోర్డు తగిలిస్తే…లోపల పనులు యథావిధిగా కొనసాగడం…బయటికి మాత్రం సీజ్…తీరు మూడు నెలల తరువాత ఇలా టు – లెట్ బోర్డు. ఇది అధికారుల నాటకమా…ఆక్రమన దారుల ఆటలా…1
ఎక్కడో కాదు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కార్యాలయానికి కూత వేటు దూరంలో…హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన అద్దె ప్రాంతం…ఐటి ఏరియా…మాదాపూర్ ఇజ్జత్ నగర్.
నాలుగు నెలలుగా కొనసాగుతున్న తతంగం
గత నాలుగు నెలలుగా ‘ముద్ర‘ ఈ అక్రమ నిర్మాణాలపై పత్రికా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. మాదాపూర్ ఇజ్జత్ నగర్ లో సర్వే నెంబర్ 2-14/2/1/2 లో గంగాల శంకర్ యాదవ్ అనే వ్యక్తి ప్రభుత్వ రేషన్ దుకాణ స్థలాన్ని ఆక్రమించుకుని మూడంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నాడన్న స్థానికుల ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు 2026 ఫిబ్రవరి 16వ తేదీన సీజ్ ఆర్డర్స్ జారీ చేసి అంసపూర్తిగా ఉన్న భవనానికి సీజ్ బోర్డు తగిలించారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురౌతుందన్న ఆలోచనతో ఉమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి జనవరి ఎనిమిదవ తేదీన మొదటి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదుల పర్వం కొనసాగడంతో మార్చి 16న సీజ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ భవన నిర్మాణం కాస్తా పూర్తైంది. అక్రమ నిర్మాణంలో ఉన్న భవనం స్కల్టన్ చుట్టూ ఆకు పచ్చ పరదా ఉండగా ఎదురు భాగంలో మున్సిపల్ అధికారులు సీజ్ అని ఉన్న ఫ్లెక్సీని అంటించారు. ఆ సీజ్ బోర్డు అలానే కన్పిస్తుంది…కానీ లోపట పనులు కొనసాగినట్లు భవనం పూర్తైనట్లు పోటోలు చూస్తే స్పష్టమౌతోంది. పనులు జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారుల నోటీసుకు తీసుకెళ్లగా ఒకరిద్దరు సానిటేషన్ సిబ్బందిని పంపించి సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. అరె…అధికారులు భాగానే స్పందిస్తున్నారనుకుంటే పొరబడినట్టే….ఆ మరుసటి రోజే మళ్లీ పనులు మొదలౌతాయి…సీన్ కట్ చేస్తే… డిసెంబర్ 2025 నుండి 2026 ఏప్రిల్ వరకు పరదాల చాటున పనులు పూర్తయ్యాయి. మున్సిపల్ అధికారులు సీజ్ చేశామంటూ తగిలించిన బోర్డు కిందే…అద్దెకు ఇవ్వబడును అంటూ యాజమాని టు – లెట్ బోర్డు పెట్టడం కొసమెరుపే కదా…
లొకేషన్ ఉంటే పంపండి పరిశీలిస్తాం….
మాదాపూర్ ఇజ్జత్ నగర్ లో సీజ్ చేసిన అక్రమ నిర్మాణానికి టు-లెట్ బోర్డు తగిలించడమేంటని మాదాపూర్ మున్సిపల్ డీసీపీని ప్రశ్నిద్దామని ఫోన్ చేస్తే స్పందించరు. ఇక స్పందించిన ఏసీపీ సురెందర్రెడ్డి లోకేషన్ ఉంటే పంపండి పరిశీలిస్తాం అంటూ సమాధానం ఇచ్చారు. సీజ్ చేసిన అధికారికే అడ్రస్ అడగటమంటే పని ఒత్తిడా లేక….పైసల వత్తిడా ఉన్నాతాధికారులే తేల్చాలి మరి.
సీఎంసీకి ఫిర్యాదు…
గతంలో ఇవే అక్రమణ నిర్మాణాలపై ‘హైటెక్ సిటీలో హైటెక్ ఆక్రమణ, అసలు వదిలి కొసరుపై కొరడా, ఎట్టకేలకు ఏడంతస్థుల భవనం సీజ్’ అనే ప్రధాన శీర్శికలతో ‘ముద్ర’ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. సీజ్ బోర్డు ఉండగానే టు – లెట్ బోర్డు ఉదంతంపై స్థానికులు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇక మున్సిపల్ అధికారులు భవనాన్ని అద్దెకిస్తారో…కూల్చివేస్తారో వేచి చూడాలి మరి.