Take a fresh look at your lifestyle.

వెనుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

-ఈ నెల 15 లోగా అర్హులందరికీ ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

-వెనుగుమట్ల బాధితులతో మంత్రి చర్చలు

ముద్ర, ఖమ్మం :

ఖమ్మం జిల్లా వెనుగుమట్ల భూదాన్ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా కల్పించారు. బాధితులలో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతంలో ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. పేద ప్రజల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్న మంత్రి… గత పాలకులు వెనుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేయని కారణంగానే నేడు కూల్చివేతలు జరిగాయని అన్నారు. ప్రతి అంశాన్ని రెచ్చగొట్టే ధోరణితో చూడవద్దని తెలిపారు. ఈ నెల 15 నాటికి అర్హులైన పేదలకు తప్పనిసరిగా ఇళ్లస్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి.. వెలుగుమట్ల బాధితులతో చర్చలు జరిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. బాధితులు ఎవరికైనా డబ్బులు ఇస్తే తమకు సమాచారం అందించాలన్నారు. వెనుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని చెప్పిన పొంగులేటీ.. తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు.  అక్కడి ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి వచ్చినట్లు కొంతమంది బాధితులు తెలియక అక్కడ ఇండ్ల పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి అన్నారు. వెనుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు,  ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని అన్నారు. అక్కడి భూదాన్ భూముల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్నవాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. అటువంటి వారికి కాకుండా మిగిలిన అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, సంబంధిత బాధితుల సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. బాధితులు వెనుగుమట్ల ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసు అధికారులకు చెప్పాలని మంత్రి సూచించారు. ఆ డబ్బులు కూడా బాధితులకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.  వెనుగుమట్ల బాధితులకు ఇచ్చే ఇండ్ల దగ్గర అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, త్రాగు నీరు, విద్యుత్ సౌకర్యం, మౌళిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, వెలుగుమట్ల బాధితులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.