- ఆపరేషన్ కర్రెగుట్ట.
- 72 గంటలుగా 12 వేల భద్రతా బలగాలు.
- 3 వేల మంది మావోయిస్టులు మకాం వేసినట్లు.
- భధ్రతా బలగాల అనుమానం.
- గుట్టలపైకి డ్రోన్ కెమెరాలతో శాటిలైట్ విజువల్స్.
- గుట్ట చుట్టూ ప్రెషర్ కుక్కర్, ఐఈడీలు, ల్యాండ్ మైన్స్.
- కొన్నింటిని గుర్తించి ధ్వంసం చేసిన పోలీసులు.
- బంకర్లో హిడ్మా ఉన్నట్లు అనుమానాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రెండు రాష్ట్రాల బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.అడవుల్లోని గిరిజన తండాలు వణుకుతున్నాయి.గూడేలు భయంతో తలుపులేసుకున్నాయి.కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా చతీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతోంది.గుట్టలపై డ్రోన్లు ఎగరవేసిన పోలీసులు దాదాపు 3వేల మంది మావోయిస్టులున్నట్లు అంచనా వేస్తున్నారు.12 వేల మంది భద్రతాబలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఏ క్షణమైనా భీకర యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.దీంతో కర్రెగుట్టపై భద్రతా బలగాలు హెలికాప్టర్ ఏరియల్ సర్వే మొదలుపెట్టాయి.పరిస్థితులను బట్టి చూస్తే పోలీస్ బలగాలు, మావోయిస్టులు అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్నారు.మరోవైపు పోలీసుల దాడులను తట్టుకునే ప్రయత్నంలో భాగంగా మందు పాతరలు పేల్చడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. కానీ, మావో అగ్ర నేతలు హింస వద్దంటున్నారు.పౌర హక్కుల నేతలు కేంద్రంతో చర్చలు జరుపుతామని హామీ ఇస్తున్నారు. కర్రె గుట్టలపై మావోయిస్టు దళాలు ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళం కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం.ఈ సందర్భంగా గుట్టలపైకి డ్రోన్ కెమెరాలను ఎగురవేసిన భద్రతా బలగాలకు.. గుట్టల్లో మావోయిస్టులు ఉన్నట్లు విజువల్స్ కనిపించాయి.ఇది దేశంలోనే అతిపెద్ద సైనికచర్యగా భావిస్తుండగా 72 గంటలుగా భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.అయితే కర్రెగుట్టలను సేఫ్ జోన్ గా మలుచుకున్న మావోలకోసం కేంద్రపారామిలిటరీ బలగాలు ప్రణాళికలో భాగంగా మొదట కర్రె గుట్టలపైకి డ్రోన్లు ఎగరేవేశాయి. శాటిలైట్ డ్రోన్ కెమెరా విజువల్స్ చూసిన భధ్రతాబలగాలు షాక్ అయినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలపై దాదాపు 3వేల మంది మావోయిస్టులు మకాం వేసినట్లు భధ్రతాబలగాల అంచనా వేస్తున్నాయి.కర్రెగుట్టల చుట్ఠూ బూబీట్రాప్స్, ప్రెషర్ కుక్కర్ బాంబులు, ఐఈడీలు అమర్చినట్లు గుర్తించి కొన్నింటిని ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.
- క్షణ క్షణం గండం
గత రెండు రోజుల నుంచి చత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్‌లో 12 వేల మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు.దీనితో కర్రెగుట్టల అడవిలో భీకరపోరు మొదలైంది.ములుగు జిల్లా వాజేడు నుంచి అటు కర్రెగుట్టల చుట్టూరా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడచూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు.దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను, అటునుంచి చత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీస్ చుట్టుముట్టాయి.ఈ నేపథ్యంలో కర్రెగుటల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోనుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందనే ప్రచారం కూడా మొదలైంది. ఒకవైపు కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2025 సంవత్సరాంతానికల్లా మావోయిస్టులను పూర్తిగా మట్టుపెడతామని ప్రకటించిన విషయం విధేయతమే.ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్ మొదలు పెట్టినట్లు సమాచారం.
- 3 వేల మంది మావోయిస్టులు..?
ప్రస్తుతం ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టపై కీలక నేతలతో పాటు మూడు వేలకు మందికిపైగా మావోయిస్టు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో కర్రెగుట్ట చుట్టూ భద్రతా బలగాల హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. హెలికాప్టర్లతో గుట్టపైన రాకెట్ లాంచర్స్తో మెరుపుదాడి చేయాలని పోలీస్ బలగాలు భావిస్తున్నట్లు సమాచారం. మంగళవారం నుంచే ఈ పరిస్థితి ఉండగా..బుధవారం కర్రెగుట్టలలో భారీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏకంగా 12 వేల మంది పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. చుట్టూ 140 కి.మీ.పరిధిలో సాయుధ బలగాల మోహరించారు.కర్రెగుట్టలను జల్లెడ పడుతూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. కర్రె గుట్టలలో గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు మూడు వేల మంది మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. మావోయిస్టులు ప్రతిదాడి చేసే అవకాశం ఉండడంతో ఎయిర్ సపోర్ట్ తో ముందుకు కదులుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ లతో పాటు రోప్ ల సాయంతో కర్రెగుట్టలపైకి భద్రతా బలగాలు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
- బంకర్ లో హిడ్మా..?
ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కర్రెగుట్టల్లోని ఓ బంకర్ లో తలదాచుకున్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు చెబుతున్నారు.హిడ్మా టార్గెట్ గా రంగంలోకి దిగిన కేంద్రపారామిలిటరీ, ఛత్తీస్ ఘఢ్, తెలంగాణ భద్రతాబలగాలు కర్రెగుట్టలను చేధించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అధునాతన ఆయుధ సంపత్తిని కర్రె గుట్టలకు చేర్చుకుంటున్నాయని అధికారులు తెలిపారు. వారం రోజలపాటు ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు భధ్రతాబలగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- నిత్యవసర సరుకులు నిలిపివేత.
ఇక కర్రెగుట్టల చుట్టూ బూబీట్రాప్స్ అమర్చి రోప్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని, సాధ్యమైనంత వరకు భద్రతాబలగాలు ముందుకు కదులుతున్నట్లు పోలీసులు తెలిపారు.నిత్యవసర సరుకులు వెంకటాపురం నుంచి తీసెకెళ్లినట్లు సమాచారం అందడంతో కర్రెగుట్టలపైకి ఆహారం, మందులు, నిత్యావసర సరుకులు నిలిపివేశారు. ఆహారం లేక మావోయిస్టు యాక్షన్ టీంలు నీరసించి బయటకు వచ్చిన సమయంలో ప్రతిదాడి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర సరిహద్దుల పరిధిలో సుమారు 280 చదరపు కి.మీ మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ కర్రెగుట్టల చుట్టూ మహారాష్ట్రకు చెందిన సీ-60 కమండోస్, తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ యూనిట్స్, ఛత్తీస్ ఘఢ్ కు చెందిన బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరెషన్ లీడ్ చేస్తున్న సెంట్రల్ మిలిటరీ ఫోర్స్ పహారా కాస్తున్నాయి.
- ఆపండి
భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు.మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా,ఏకపక్షకాల్పులు జరపడం సరి కాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతిచర్చలు జలపాలని డిమాండ్ చేశారు.
