Take a fresh look at your lifestyle.

సర్పంచుల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం-  రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి

బోథ్, ముద్ర:

సర్పంచ్ ల తీర్మానంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా గల సర్పంచులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం రూపుదిద్దుకుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై సర్పంచులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో హెల్మెట్ ఉంటేనే వాహనదారులను అనుమతించేలా సర్పంచులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, మద్య సేవించి వాహనం నడపకుండా ఉండటం వంటి ప్రాథమిక నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు “అరైవ్ అలైవ్” లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రతి సర్పంచ్, ఎస్.హెచ్.జి సభ్యులు, రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎజెండాలో రోడ్డు భద్రతా అంశాలను చేర్చి విస్తృతంగా చర్చించాలని సూచించారు. ఇతర అభివృద్ధి ప్రణాళికలతో పాటు రోడ్డు భద్రతను ఒక ముఖ్యమైన అంశంగా తీసుకున్నప్పుడే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారుతాయని స్పష్టం చేశారు. ప్రమాదాల తీవ్రతను వివరిస్తూ, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఒక రెవెన్యూ ఉద్యోగి ఉదంతాన్ని కలెక్టర్ ఉదాహరణగా పేర్కొన్నారు. డీజీపీ దిశానిర్దేశంలో జిల్లాలో ఇప్పటికే ప్రమాదాల సంఖ్య తగ్గిందని, ఇదే స్ఫూర్తితో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి “అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్, సర్పంచులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.