ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి తెలిపారు.
బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని యువతకు వివిధ వృత్తి కోర్సుల్లో శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
రెడ్ క్రాస్ సంస్థ నిర్మించిన భవనంలో త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వివిధ సంస్థలను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం నూతన శిక్షణ కోర్సులను రూపొందిస్తోందని, విద్యారంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనంతరం రెడ్ క్రాస్ కార్యకలాపాల అమలుపై సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో:
రెడ్ క్రాస్ స్టేట్ మెంబర్ రమేష్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణారావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు ముచ్చర్ల దినకర్, ఉండ్యాల రాజమహేందర్ రెడ్డి, మధు, పి. శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.