Take a fresh look at your lifestyle.

వ్యాపార విస్తరణ ప్రాజెక్టుల్లో మరింత వేగం పెరగాలి

  • పనులు మందకొడిగా సాగితే ఉపేక్షించేది లేదు.
  • అన్ని విభాగాల అధిపతులకు సింగరేణి సీఎండీ హెచ్చరిక.
  • సోలార్, పవన, జియో థర్మల్ విద్యుత్తు, బొగ్గు నుంచి కెమికల్స్ పై ప్రత్యేక సమీక్ష.

ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులు, పనుల్లో మరింత వేగం పెంచాలని ఆ సంస్ధ సీఎండీ బలరామ్​ అధికారులను ఆదేశించారు. మందకొడిగా పనులు కొనసాగితే ఉపేక్షించేది లేదని పలు విభాగాల అధికారులను హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన సోలార్ విద్యుత్, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్, జియో థర్మల్ విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, కీలక ఖనిజాల ఉత్పత్తి, జాయింట్ వెంచర్ల ఏర్పాటు, కార్బన్ డయాక్సైడ్ నుండి మిథనాల్ తయారీ,సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్, భూగర్భ గనుల్లో కోల్ గ్యాసిఫికేషన్ తదితర 28 రకాల ప్రాజెక్టులు,పనులపై ఆయన సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే ప్రాథమిక అవగాహనకు వచ్చామన్న ఆయన కొన్ని పనుల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మరికొన్ని పనులపై ఏజెన్సీల ద్వారా అధ్యయనం జరుగుతుందని చెప్పారు. సింగరేణి సంస్థకు ఈ వ్యాపార విస్తరణ చర్యలు ఎంతో అవసరం ఉన్న నేపథ్యంలో ఆయా పనులను మరింత వేగవంతంగా నిర్వహించాలన్నారు. వివిధ విభాగాల అధికారులు తమకు కేటాయించిన పనులపై వివరించగా ఆయన పనుల్లో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. మరో పది రోజుల్లోపు ప్రతి పనిలో ప్రగతి కనిపించాలన్నారు. ఇకపై ప్రతివారం బొగ్గు ఉత్పత్తిపైనే కాకుండా ప్రత్యేకంగా వ్యాపార విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష ఉంటుందని సీఎండీ స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలపై సానుకూల ధోరణితో ఉన్నాయని చెప్పారు.ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార విస్తరణ చర్యలు త్వరగా అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు కార్యాలయాలు, క్వార్టర్ల పైన చేపట్టాల్సిన రూఫ్ టాప్ సోలార్ పవర్ గురించి, కోల్ వాషరీల ఏర్పాటు, హైడ్రాలిక్ కన్వేయర్ల ఏర్పాటు వంటి విషయాలపై లోతుగా చర్చించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని, ఇంకా జీఎం సి.పి.పి ఎ.మనోహర్, జీఎం మార్కెటింగ్ ఎన్. వి.రాజశేఖర్ రావు, సింగరేణి థర్మల్ పవర్, సోలార్ పవర్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, సింగరేణి సివిల్, బిజినెస్ డెవలప్ మెంట్, తదితర 20 శాఖల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.