Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక బృందాలు అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు సమీక్షా సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అలాగే ఖానాపూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కల్వర్టులు, వంతెనల పనుల్లో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. ప్రతి పనిని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. అటవీ శాఖ అనుమతులతో ముడిపడి ఉన్న పనుల కోసం వెంటనే ‘పరివేశ్’ పోర్టల్‌లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖానాపూర్ పట్టణ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమగ్రంగా సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. అటవీ క్లియరెన్స్ విషయంలో అధికారులు వేగంగా స్పందించాలని, అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. పనుల పురోగతిలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.