Take a fresh look at your lifestyle.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో అదికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. మైనారిటీల సంక్షేమానికి రూ.3,500 కోట్ల బడ్జెట్ కేటాయించడం ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమన్నారు. బుధవారం నాంపల్లిలో రెడ్ రోజ్ ప్యాలెస్‌లో రాష్ట్ర మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాలను ఆయన ప్రారంభించిన మంత్రి.. లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయ పథకాల ప్రారంభం, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, శిక్షణ–ఉద్యోగ–ప్లేస్‌మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మైనార్టీల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సబ్సిడీ ఆధారిత పథకాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి అలాగే ఉపాధి కల్పన కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తున్నామన్నారు. యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని స్థిరమైన జీవనోపాధిని సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద 5,000 అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.50వేల వరకు ఆర్థిక సహాయం అందించామన్నారు. ఈ పథకానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ-స్కూటర్ పథకం కింద 3,150 మందికి ప్రయోజనం కలిగిందన్న మంత్రి.. ఒక్కో యూనిట్ ఖర్చు రూ.1.50లక్ష ఉందన్నారు. అందులో రూ.1.20లక్ష(80 శాతం) ప్రభుత్వ సబ్సిడీగా, రూ.30వేలు (20 శాతం) లబ్ధిదారుల వాటాగా ఉందన్నారు. ఈ పథకానికి మొత్తం రూ.37.80 కోట్లు కేటాయించామన్నారు. 2వేల మందికి జనరేటర్లు , టూల్‌కిట్లు వంద శాతం సబ్సిడీ పై ఇచ్చామన్నారు. శిక్షణ – ఉద్యోగ–ప్లేస్‌మెంట్ కార్యక్రమం కింద రూ.9.76 కోట్లతో 55 ఎంపానెల్డ్ శిక్షణ సంస్థల ద్వారా 4,800 మంది మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. అదనంగా 33,750 మంది మైనారిటీ మహిళలకు ఒక్కోటి రూ.7,950 విలువైన కుట్టుమిషన్లు 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. ఇందుకు రూ.27 కోట్లు కేటాయించబడ్డాయన్నారు. ఈ సందర్భంగా మోపెడ్లు, ఈ-బైక్‌లకు మంత్రి హరిత జెండా ఊపి అందచేశారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. అలాగే దరఖాస్తులు 19 ఫిబ్రవరి 2026 నుండి 28 ఫిబ్రవరి 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ http://tsobmms.cgg.gov.in ద్వారా స్వీకరించబడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కోత్వాల్, ఎమ్మెల్సీలు మిర్జా రహ్మత్ బేగ్, రియాజుల్ హసన్, పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీయుల్లా మాజీ ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్, అఫ్జల్ బియాబాని ఖుస్రో పాషా, హజ్ కమిటీ చైర్మన్ అజ్మతుల్లా హుస్సైనీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఫహీమ్ ఖురేషీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.