మాజీ సీఎం మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు
నేడు మరోసారి నోటీసులు ఇవ్వనున్న సిట్
న్యాయనిపుణులతో దర్యాప్తు బృందం భేటీ
ప్రశ్నలు సిద్ధం చేసుకున్న అధికారులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు పోలీసు మాజీ ఉన్నతాధికారులు, మంత్రులు, నాయకులను విచారించిన సిట్ అధికారులు.. తుది దశలో కేసీఆర్ ను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 29న హైదరాబాద్ లోని నందినగర్ లో ఎన్న కేసీఆర్ ఇంటికి వెళ్లిన అధికారులు.. ఈ నెల 30న విచారణకు సిద్ధంగా ఉండాలని కోరారు. కానీ అదే రోజు రాత్రి విచారణను వాయిదా వేయాలని కేసీఆర్.. సిట్ అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగున్న వేళ నేడు విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తనకు కాస్త సమయం కావాలని కోరారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే విచారణ చేసుకోవచ్చని తెలిపారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని అన్నారు. దీంతో కేసీఆర్ కు సిట్ అధికారులు మినహాయింపు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సిట్ అధికారులు శుక్రవారం సాయంత్రం న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఇందులో కీలక అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు కేసీఆర్‌ను ఎక్కడ విచారణ జరపాలనే అంశంపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. న్యాయ సలహాల తర్వాత కొత్త తేదీతో నేడు రెండోసారి నోటీసులు ఇవ్వడానికి నిర్ణయించినట్లు సమాచారం.
‘సిట్’ ప్రశ్నాస్త్రం
కేసీఆర్ ను విచారించేందుకు సిద్ధమవుతోన్న సిట్… ఆయన్ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును రిటైర్ అయిన తర్వాత మళ్లీ అదే స్థానంలో ఓఎస్డీగా ఎలా నియమించారు? రిటైరైన అధికారికి ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలు ఎందుకు అప్పగించారు? రాధాకిషన్‌రావు రిటైరైన తర్వాత కూడా ఏళ్ల తరబడి కొనసాగడానికి కారణాలేమిటి? ఇవి పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలా? లేక మీరు చెబితేనే వారు ఆదేశాలిచ్చారా?’ తదితర ప్రశ్నలు కేసీఆర్‌కు సంధించేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ విచారణ తర్వాత తుది ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందే మరోసారి కేటీఆర్, హరీశ్, సంతో్‌షను సిట్‌విచారించొచ్చని తెలుస్తోంది.