ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: తాటి చెట్టు పై నుండి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల జంగయ్య (56) కల్లుగీత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ గానే శుక్రవారం సాయంత్రం పోల్కంపల్లి గ్రామ సమీపంలోని బొత్తల ఒంపులో ఉన్న తాటిచెట్లలో కల్లు గీసేందుకు తాటి చెట్టు పైకి ఎక్కాడు. కల్లు గీస్తుండగా మోకు జారిపోవడంతో చెట్టు పైనుండి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా జంగయ్య గౌడ్ మృతి చెందాడు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
