Take a fresh look at your lifestyle.

రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమే..జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్…

చంద్రబాబు స్కెచ్ తోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిండు…
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నవంటే అది కేసీఆర్ పుణ్యమేనని మాజీమంత్రి, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ లో చేరిన తర్వాత మొదటి సారి జగిత్యాలలోని బిఅర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన జీవన్ రెడ్డి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో కెసిఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్నీ తలపించిందని అన్నారు. రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని, కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటే రేవంత్ రెడ్డి
మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం ఊసే లేదని,భూమి లేని వారికి ప్రోత్సాహకం ఇస్తామని మరిచారని, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయడంలేదని, అది కూడా పెళ్లి నాటికి ఇవ్వాల్సినది ప్రసూతి నాటికి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవ చేశారు. కెసిఆర్ కిట్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ పేరుతో అమలు చెయ్యాలని, రాష్ట్రం తనవంతు వాటా ఫీజు రీయింబర్సెంట్ నిధులు ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి మళ్ళాయన్నారు. రేవంత్రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని అంటే రేవంత్ రెడ్డి కీడు కోరలేదని, ప్రజలు పాలన మార్పు కోరుతున్నారన్నారు. వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్ ను ఉరి తీస్తావా? అని ప్రశ్నించారు. మేడిగడ్డి కుంగి పోయి 30 నెలలు అయిందని, రేవంత్ రెడ్డి ఇప్పుడు నిద్ర లేచినట్టు నటిస్తున్నాడన్నాడు. మరమ్మతులు చేస్తే కేవలం రూ.400 కోట్లు అవుతాయని, ఎండిఎస్ఏ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్న ఇప్పటికీ మర్మతులు చేపట్టలేదని, కేసీఆర్ ను దోషిగా చేయడం కోసం జాప్యం చేస్తున్నారని విమర్శించారు. తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొని ఎందుకు నిర్మించలేదని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సుమారు 1000 టిఎంసి నీరు లభిస్తుందనీ కాళేశ్వరం నిర్మించారని గుర్తు చేశారు. వాతావరణం అనుకూలించకపోతే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారితే రేవంత్రెడ్డి బాధ్యుడు కాదా అని నిలదీశారు. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని రేవంత్ రెడ్డి ఓటుకు నోటు తెరపైకి తీసుకు వచ్చినారని, రాష్ట్రానికి పట్టిన శని పీడా రేవంత్ రెడ్డి అని, అది తొలగిపోవాలన్నారు. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకమని, 1981 లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికతే 13 మంది కాంగ్రెస్ లో చేరితే నేను ఒక్కడినే పార్టీ మారలేదన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు ను తొలగించడం సరికాదని, ఇందిరా గాంధీ సైతం అండగా నిలిచిందని, అందుకే నేను రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి తెల్సుకోవాలన్నారు. 1984 లో పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, శాసన సభ రద్దు అయిన తర్వాతా పార్టీ ప్రజస్వామికంగా మారానని, రాజ్యాంగం ఉల్లంఘించి కాదని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజకీయ జీవితం కొనసాగిందన్నారు. 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కడినే గెలిచానని, 2019 లో శాసన మండలి లో ఒంటరిగా పోరాటం చేశానని, పార్టీ ఫిరాయింపు వర్తించకున్న పార్టీ మారలేదన్నారు. పదవులు నేను ఏనాడు ఆశించలేదని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదిగింది జగిత్యాలలోనేనని పేర్కొన్నారు. మేడిగడ్డను ఏం చేయాలనుకుంటున్నావు చెప్పాలని, మేడిగడ్డ మరమ్మత్తుకు చిత్తశుద్ధి ఉందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని, చెరువులు అక్రమిస్తే తొలగించాలి గాని, పేదల ఇళ్లు కూల్చడం కాదని, మూసి ప్రక్షాళన చేయి, సుందరీకరణ కాదన్నారు. ప్రజా పాలన నెపంతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని, కెసిఆర్ ఆర్ టి సి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఆర్ టి సి కార్మికులు సమ్మె ఎందుకు చేయబోతున్నారన్నారు. సింగరేణి బోగ్గుగని కార్మికులకు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోమ్ గార్డ్స్ అన్ని వర్గాల ప్రజలు అభద్రత లో ఉన్నారని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏమైందొ, రాష్ట్రంలో ఏం జరుగుతోంది రాహుల్ గాంధీకి కనపడుతలేదా? అని ఎద్దేవ చేశారు. జీవన్ రెడ్డి కి 14 సార్లు టికెట్ ఇచ్చిన అంటే సమర్థత లేకుండా ఇచ్చారా? అని, గత ఎమ్మెల్సి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కాలుకు బలపం కట్టుకొని తిరిగి ఎందుకు గెలిపించలేకపోయావన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్ లో బీజేపీ కి 60 వేల ఓట్లు పెరిగినాయని, రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఏంపీ గా ఉన్న
ఒక్క సీటు గెలవలేదని విమర్శించారు. నీ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఏమి లేవని, కేసీఆర్ మాత్రమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏమైతధో తెలియదని, కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వీర్యం అవుతుందన్నారు. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ మాటలు వినేందుకు టీవీ ల ముందు కూర్చున్నారని, కేసీఆర్ సభను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన, సభ విజయవంతం అయిందన్నారు. 20 నెలలు మానసిక క్షోభ అనుభవించిన నన్ను, కేసీఆర్ పెద్ద మనసుతో అక్కున చేర్చుకున్నాడని, ప్రజా జీవితానికి నూతన అధ్యాయం ఆరంభం అయిందన్నారు. వేం నరేంద్ర రెడీ కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసిండని రాజ్యసభ సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే స్పీకర్ కు ఇవ్వాల్సి ఉంటే చంద్ర బాబు నాయుడికి ఇచ్చారని, చంద్రబాబు స్కెచ్ తోనే రేవంత్రెడ్డి కాంగ్రెస్ లో చేరిండన్నారు. పదవుల వెంట వెంపర్లాడేది నేను కాదని, రేవంత్ రెడ్డేనని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ రోజు ఒకసారి రాజ్యాంగంలో పదో షెడ్యూలు చదువుకోవాలన్నారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సంజయ్ రేవంత్ రెడ్డి తో కలిసి ప్రయాణం చేస్తున్న అంటున్నాడని, తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి బీజేపీ లో కలువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జెడ్పీ మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, మాజీ మార్క్ఫెడ్ చైర్మెన్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.