- హిమాచల్ ప్రదేశ్ లో బిల్డ్ ఒన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో ఏర్పాటు
- ప్రతిపాదనలు సమర్పించనున్న తెలంగాణ
- ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని బృందం
- హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ వింధర్ సింగ్ సఖుతో భేటీ
- త్వరలోనే ఒప్పందం
- సోలీ, మియార్ లో 520 మె.వా ప్రాజెక్టుల ఏర్పాటుకు సన్నాహాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్ సామర్థ్యం పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బిల్డ్ ఒన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో డ్రైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించనుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ సఖుతో గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో బూట్(బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తెలంగాణ బృందం నుంచి ప్రతిపాదనలు కోరింది.
తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృం హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించి, ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజె లపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసిత్వరితగతిన పంపితే తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మరోవైపు హిమాచల్ లో సెలీ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (400 మెగావాట్లు) మియర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (120 మెగావాట్లు) ప్రాంతాలను తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. తమ అధ్యయనంలో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేయాలని సిఫారసు చేశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ గురువారం అధికారికంగా ఒక లేఖను సమర్పించింది.ఈ సందర్భంగా ఎంఓయూ ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎం కోరారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి, త్వరితగతిన ఒప్పందంపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయనున్నారు.