ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవలి ఎన్నికల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళిక పై పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో సర్పంచ్ లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ నెల 12న అవగాహన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీల వారీగా కౌన్సిలర్లకు, మండలాల వారీగా సర్పంచ్ లకు సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాన్ని నిర్ణిత సమయానికి ప్రారంభించి సాఫీగా కొనసాగించాలన్నారు. సరైన లైటింగ్, సౌండ్ సిస్టం, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశానికి హాజరైన వారికి ఎప్పటికప్పుడు త్రాగునీరు అందిస్తూ ఉండాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలన్నారు. వాహనాలకు తగిన పార్కింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భోజనశాలను పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.