– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి
వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ఐటిఐ ప్రాంగణంలో శనివారం సుమారు 42.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి 2400 కోట్ల రూపాయల వ్యయంతో 65 ఏటిసి కేంద్రాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన అనంతరం భువనగిరిలో ఏ టి సి ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టాటా సహకారంతో ఏటీసీలు ఏర్పాటు చేయడం జరిగిందని, భువనగిరి ఏ టి సి ని సుమారు 42.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమాజంలో నిరుద్యోగ సమస్య వల్ల యువత పక్కదారి పడుతుందని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏటీసీలను ఏర్పాటు చేశారని చెప్పారు. యువతకు టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తునే ఒక వైపు ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. యువత కష్టపడి చదవాలని, తద్వారా ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.