Take a fresh look at your lifestyle.

ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులను వదిలేస్తే కేసులు పెట్టండి

  • వృద్ధుల సంక్షేమానికి స్పెషల్ డ్రైవ్, టేక్ కేర్ సెంటర్లు.
  • త్వరలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఫిజియో థెరఫీ సేవలు.
  • సెలవుల తర్వాత “ సెల్ఫీ విత్ అంగన్వాడీ ” కార్యక్రమాలు.
  • కాంట్రాక్టర్లు నాణ్యత లేని ఆహారం అందిస్తే తిరష్కరించండి.
  • అధికార్లు చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదు.
  • తప్పుడు సమాచారంతో వార్తలు రాస్తే కేసులు పెడతాం.
  • మారుమూల ప్రాంతాలకు సైతం తాగు నీరందించాలి.
  • కొత్తగూడెం సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులను చూడని పిల్లలపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ( ధనసరి అనసూయ ) సంబంధిత అధికార్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె కొత్తగూడెంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వయో వృద్దుల సంక్షేమానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అంతే కాకుండా, వయోవృద్ధుల కోసం టేక్ కేర్ సెంటర్లు ప్రారంభించాలని చెప్పారు. అలాగే, త్వరలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఫిజియో థెరఫీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం సందర్భంగా “ సెల్ఫీ విత్ అంగన్వాడీ ” కార్యక్రమాలు చేపట్టాలని అధికార్లకు సూచించారు. త్వరలోనే అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అలనా పాలనా చూసుకోవడం కోసం క్రష్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కాంట్రాక్టర్లు నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేస్తే వెంటనే తిరస్కరించాలని ఆదేశించారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడి భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, పాఠశాలలను గుర్తించి అంగన్వాడి కేంద్రాలను అందులోకి మార్చాలని సూచించారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో, పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయులు చేతుల్లో ఉందని, పిల్లలు అన్నీ విధాలా అభివృద్ధి చెందేందుకు అంగన్ వాడీ కేంద్రాలు దోహద పాడాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు ఎప్పుడూ జిల్లా ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని, అంగన్వాడి కేంద్రాలలో ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వికలాంగులకు విందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. గాలి తర్వాత ప్రజలకు అత్యంత ముఖ్యమైనది నీరని, దానిని ప్రజలకు అందించడమే మనందరి అంతిమ లక్ష్య కావాలన్నారు. మారుమూల ప్రాంత ప్రజలకు సైతం సురక్షితమైన త్రాగునీరు అందించాలని అధికార్లను ఆదేశించారు. వారం రోజుల పాటు మిషన్ భగీరథ సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. అలాగే, నియోజక వర్గాల వారీగా మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన పనులు నివేదికలు అందించాలని అధికార్లను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా చేపడుతున్న పనులను సమన్వయం చేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు. తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ప్రజలకు తెలియజేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు త్రాగు నీటిని సరఫరా చేయాలని సూచించారు. తప్పుడు సమాచారంతో ఎవరైనా వార్తలు రాస్తే కేసులు పెడతామని సీతక్క ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మేల్యేలు కూనంనేని సాంబశివ రావు, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.