రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో విచారణ
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పార్టీపై దర్యాప్తు
దుబాయ్ లింకులపైనా ఆరా
‘పైలెట్’కు బీఆర్ఎస్ షోకాజ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ తన విచారణను ప్రారంభించనుంది. ఈ బృందం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించి లోతైన విచారణ జరగనుంది. ఆ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు..? అక్కడ డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది..? అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఈ డ్రగ్స్ దందాతో దుబాయ్‌కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఉన్న పరిచయాలను వెలికితీయనున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా డ్రగ్స్ మనీని ఎలా మళ్లించారనే అంశంపై సిట్ ఫోకస్ చేయనుంది. అక్రమ సంపాదనకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అధికారిక ఉత్తర్వుల విడుదలతో సిట్ అధికారులు త్వరలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
‘పైలట్’కు బీఆర్ఎస్ నోటీసులు :
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ మంగళవారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడ హాజరై ఉన్నారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండటం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై ‘సిట్’ ఏర్పాటు చేసిన తరుణంలో సొంత పార్టీ కూడా రోహిత్ రెడ్డిపై చర్యలకు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది