ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో దత్తత గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాల్లో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు.కల్పకూర్, అంగడిపేట గ్రామాలలో 90 మంది విద్యార్థులతో, మల్కాపూర్ గ్రామంలో 45 మంది బాలికలతో కొనసాగుతున్న శిబిరాల మూడవ రోజున స్వచ్ఛత సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్పకూర్ గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయం,పరిసర ప్రాంతాలను విద్యార్థులు శుభ్రపరిచారు. చెత్తాచెదారం,ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, దేవాలయం పరిసరాలను పర్వదినానికి అనుగుణంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మల్కాపూర్ గ్రామంలో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేసి పరిశుభ్రత ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. స్వచ్ఛమైన పరిసరాల ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పరిశుభ్రత కీలకమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛత ఎంతో దోహదపడుతుందని, కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాల ద్వారా గ్రామాల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వాలంటీర్లు కృషి చేస్తున్నారని తెలిపారు.ఈకార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ సదయ్ కుమార్, డాక్టర్ వాణి పాల్గొన్నారు. కల్పగూర్‌లో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మల్లేష్,సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మల్కాపూర్‌లో ఉన్నత పాఠశాల హెచ్‌ఎం యాదగిరి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మరియు గ్రామ పెద్దలు విద్యార్థులకు మద్దతు అందించారు.