Take a fresh look at your lifestyle.

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చాం-నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్ లో ప్రతిపక్షంలో ఉంటాం

వార్డు సభ్యులు, కార్పొరేటర్లను ఎత్తుకెళ్తే తీవ్ర పరిణామాలు
ముద్ర, నిజామాబాద్ :

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 డివిజన్లలో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుందని స్ధానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్, బీఆర్ఎస్ ను డామినేట్ చేశామన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు సాధించామన్నారు. శనివారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాగైనా గెలిచాం కాదా అని కాంగ్రెస్.. మున్సిపల్ వార్డు సభ్యులు, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే బీఆర్ఎస్‍కు పట్టిన గతే కాంగ్రెస్‍కు పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రభుత్వమేమి కాదన్న అర్వింద్.. సీఎం రేవంత్ రెడ్డి బలమైన పొజిషన్‍లో లేరన్నారు. సీఎంను ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖను తన స్వార్ధ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని ఎంపీ ఆరోపించారు. పోలీసులు తనపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వాస్తవానికి తానే పోలీసులపై కేసు పెట్టాలన్నారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పోలింగ్ బూత్ ల నుంచి బయటికి పంపిన పోలీసులు.. కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడానికి కాంగ్రెస్ వారికి సహయం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షిస్తారా లేక బ్రేక్ చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టుపట్టించారనే కేసీఆర్‍ను ప్రజలు ఓడించారని ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్లీ అదే చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని కార్పొరేటర్లు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది వారి వారి పార్టీలు నిర్ణయించుకుంటాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.