ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రబీ 2025-26 వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.
మంగళవారం అదనపు కలెక్టర్ తన చాంబర్ లో ధాన్యం సేకరణలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టోకెన్ పద్ధతి ద్వారా కొనుగోళ్లు జరిపి, ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ఎత్తు, పల్లాలు సరిచూసుకుని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనగా, వేయింగ్ మెషీన్ లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ లు, గన్నీ బ్యాగులను సరిపడా సిద్దం చేసుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్ షీట్లను అందజేయాలని సూచించారు. అదే విధంగా వేసవి దృష్ట్యా రైతులకు, నిర్వాహకులకు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, నీడ, షెడ్లు, టెంట్లు, కుర్చీలు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తదుపరి అన్ని PPC కేంద్రాల వారు PCSAP పోర్టల్ యందు సంబంధిత ఎంట్రీస్ ఈ నెల చివరిలోగా నమోదు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి,సంబంధిత అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.