Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ..? ఎన్నెన్ని ఉన్నాయో లెక్క తేలుస్తాం-మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ … ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది
నేను కాన్ఫరెన్స్ కాల్‍లో ఏం మాట్లాడానో ఆ పార్టీ నేతలకు ఎలా తెలుస్తుంది..?
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ..? ఎన్నెన్ని ఉన్నాయో లెక్క తేలుస్తాం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‍గా తీసుకుంటుంది
మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ముద్ర, ఖమ్మం :
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల వద్ద ఉన్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. లేకుంటే తాను కాన్ఫరెన్స్ కాల్‍లో ఏం మాట్లాడానో ఆ పార్టీ నేతలు ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‍గా తీసుకుంటుందన్నారు. ఇంకా ఎన్ని పరికరాలు ఏయే మామిడితోటలు, ఫామ్ హౌస్‍లు, ఇళ్లలో ఉన్నాయో? ఫోన్ కాల్స్ ఇంకా ఎంత మంది వింటున్నారో ఎంక్వైరీ చేసి అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అధికారంలో ఉండగా బెదిరింపులకు పాల్పడిన వారికి… తాము ఓట్లు అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడినట్లు భావన కలుగుతోందని విమర్శించారు. సామాన్య ప్రజలకు హక్కు ఉన్నట్లుగానే ఉద్యోగులకు కూడా తమ ఓటును వినియోగించుకునే హక్కు ఉందన్నారు. అధికారులను ఓటు అడగడంలో తప్పేముందని నిలదీశారు. సీఎం రేస్‍లో తాను లేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను అనేక సందర్భాల్లో చెప్పానని చెప్పారు. తాను పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనని వివరణ ఇచ్చారు. తాను సీఎం రేస్ లో ఉన్నట్లు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారనీ… ఈ విషయంలో ఎవరి అభిమానం వారిదని అన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల పెంపు, తగ్గింపు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్న పొంగులేటి.. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కనీసం ఈ చర్చకైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‍కు పట్టం కట్టబోతున్నారని గ్రహించిన కేటీఆర్.. అదే భంగపాటుతో సీఎంరేవంత్ రెడ్డి, మిగతా ముఖ్య నేతలపై నోరుపారేసుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనూ చాలెంజ్ లు చేసి, రెఫరెండమని మాట్లాడి భంగపడ్డారన్నారు. మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలవబోతోందనే బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారన్నారు. నేడు జరగనున్న ఎన్నికల్లో 80 శాతానికి పైగా మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం రెండేళ్లుగా పేదవాడికి అండదండగా నిలిచేలా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి చేస్తోందని మంత్రి వివరించారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన పాలసీలు తీసుకువచ్చి విద్యా, వైద్యానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు 71 వేల ఉద్యోగులకు ఇచ్చామన్న ఆయన రైతులకు రుణమాఫీ, రైతుభరోసా ఇస్తూ రైతులను రాజును చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెల్లాచెదురు చేస్తే తాము వచ్చి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.