మాదాపూర్, ముద్ర: జర్మన్ లాంగ్వేజ్ పై టి-సాట్ ప్రత్యేక పాఠ్యాంశాలను ఈ నెల నాల్గవ తేది నుండి ప్రసారం చేయనుందని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పలు భాషలపై ప్రత్యేక లెసన్స్ ప్రసారం చేసిన టి-సాట్ నిరుద్యోగ యువత, విద్యార్థినీ విద్యార్థులు జర్మన్ లాంగ్వేజ్ ను సులువుగా,ఉచితంగా నేర్చుకునేందుకు డిజిటల్ పాఠ్యాంశాలను ఈ నెల నాల్గవ తేదీ మంగళవారం మధ్యాహ్నాం ఒంటి గంట నుండి ఒంటి గంటన్నర వరకు అరగంట పాటు ప్రత్యేకంగా ప్రసారం చేస్తామని, అవే ప్రసారాలు విద్య ఛానల్ లో సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల వరకు ప్రసారమౌతాయని సీఈవో స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన రామకృష్ణ మఠ్ బోధన సిబ్బంది బోధించిన పాఠ్యాంశాలను మొదటి విడతలో సుమారు 20 ఎపిసోడ్స్ ప్రసారమతాయన్నారు.ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం యువత అమెరికా తరువాత జర్మనీ వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారని, అక్కడికి వెళ్లేందుకు భాష పరమైన ఇబ్బందులు తొలిగించాలనే లక్ష్యంతో జర్మన్ లాంగ్వేజ్ పై డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారాలు చేయాలని నిర్ణయించామని వేణుగోపాల్ రెడ్డి వివరించారు. జర్మనీలో పనిచేయాలనుకునే వారి కోసం ఇటీవలి కాలంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పలు విడతలుగా జర్మన్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని, అటువంటి శిక్షణ కార్యక్రమాలు ఒక శాఖకే పరిమితం కాకుండా తెలంగాణాలోని అన్ని వర్గాలకు తోడ్పడే విధంగా జర్మన్ లాంగ్వేజ్ పై పాఠ్యాంశాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
- కేంద్ర బడ్జెట్ పైనా పాఠ్యాంశాలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ పై టి-సాట్ నెట్వర్క్ పోటీపరీక్షల కోణంలో ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించి ప్రసారం చేసిందని,పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోని అంశాలు,రెవెన్యూ రాబడి, వ్యయం,పన్నులు,ఆర్ధికాభివృద్ది వంటి అంశాలపై సమగ్రంగా ఈ పాఠ్యాంశాలుంటాయని,పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకు కరేంట్ అఫైర్స్ రూపంలో అందించే లెసన్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.టి-సాట్ నిపుణ ఛానల్లో ప్రతీ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి టి-సాట్ విద్యా ఛానల్ లో అదేరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రసారం అవుతాయని,ప్రసారాలతో పాటు టి-సాట్ యాప్ అండ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి వివరించారు.