ముద్ర ప్రతినిధి, నిర్మల్:

జిల్లాలోని నిర్మల్,ఖానాపూర్, భైంసా పురపాలక సంఘాలకు బుధవారం జరగనున్న ఎన్నికలకు సిబ్బంది తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల్లో244 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ లో 145 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా వీటిలో అత్యల్ప ఓటర్లు 599 కాగా అత్యధిక ఓటర్లు 792. అలాగే భైంసాలో 74 పోలింగ్ కేంద్రాల్లో అత్యల్పంగా 519, అత్యధికంగా 860 ఓటర్లతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా ఖానాపూర్ లో 25 పోలింగ్ కేంద్రాల్లోబత్యల్పం 581, అత్యధికం 800 ఓటర్లతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.మొత్తం 1464 సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా భైంసా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలని, ఎలాంటి అవక తవకలు లేకుండా చూడాలని సూచించారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ అధికారులకు సమర్పించాల్సిన పత్రాల్లో లోపాలు లేకుండా చూడాలని సూచించారు.