- దాన్ని కాపాడాల్సిన అవసరం ఆసన్నమైంది.
- దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోంది.
- ఆపరేషన్ కగార్ కేంద్ర చర్యను ఖండిస్తున్నాం.
- మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా ప్రధాని చలించలేదు.
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్టికాయలు వేస్తే పాకిస్తాన్ తో యుద్ధం ఆపేశారు.
- టీపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశంలో ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ విషయంలో సెక్యులరిజం భావాలు కలిగిన నాయకులు, పార్టీలన్నీ కలిసి ముందడుగు వేయాలని కోరారు.దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఆపరేషన్ కగార్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్, దేశ భద్రత అంశాలపై కమ్యూనిస్టు పార్టీ ల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కాంగ్రెస్ పార్టీ తరపున ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది శాంతి, రాజ్యాంగం పట్ల విధ్వంసకర చర్యగా భావిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చలించలేదన్నారు. అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్టికాయలు వేస్తే మాత్రం ఆపరేషన్ సింధూర్ ను నిలివేసిన మోడీ.. ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోందని నిలదీశారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలనీ ఇదే ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అహింస పునాదులపై నిర్మితమైందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. హింస ఎవరి నుంచి వచ్చినా దాన్ని తాము ఖండిస్తామన్నారు.గతంలో ఆర్థిక అసమానతలతో నక్సలిజం పుట్టిందని ఆయన గుర్తు చేశారు.ఆ కాలంలో గ్రామాల్లో జరిగిన అఘాయిత్యాలు నక్సలిజం ద్వారా కొంత వరకు తగ్గాయని అభిప్రాయపడ్డారు.కానీ క్రమేణ తప్పుదారి పడుతూ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ప్రయత్నాలకు వేదికగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, నక్సలిజాన్ని నిర్మూలించేందుకు శాంతియుత పరిష్కార మార్గాలను పరిశీలించకుండా, శాంతి భద్రత సమస్యను సాకుగా చూపి కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.ఈ ఆపరేషన్ ద్వారా అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తోందన్నారు. మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మతం సెంటిమెంట్ ను సాకుగా చూపి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.ఇలాంటి పరిస్థితుల్లో లౌకికవాద శక్తులు ఏకమవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కమ్యూనిజం భావాలు ఉన్నవారు బలపడాలన్న మహేశ్ కుమార్ గౌడ్ దేశం మొత్తం ప్రజాస్వామ్య భావాలు ఉన్న వ్యక్తులు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.