కేసీఆర్‌ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే
రెండేళ్లలో నారాయణపేటలో తట్టెడు మట్టికూడా ఎత్తలేదు
– జిల్లా పోతే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతాము
– బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్. రాజేందర్ రెడ్డి
ముద్ర, నారాయణపేట: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును (కేసీఆర్) టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్. రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ నారాయణపేట పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి ముత్తిరెడ్డి పాల్గొని, ఎస్. రాజేందర్ రెడ్డితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్. రెడ్డి మాట్లాడుతూ, సిట్ ఇచ్చిన నోటీసులు కేసీఆర్‌కు కాదని, యావత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నోటీసులేనని అన్నారు. నోటీసులు ఇచ్చినప్పటి నుంచే తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఈగ వాలినా ప్రభుత్వం ఉంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్‌ను ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టాలని తెలంగాణ ద్రోహులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన కేసును ఇప్పుడు ఎన్నికల ముందు తెరపైకి తీసుకువచ్చి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను నిరుత్సాహపర్చాలనే నాటకాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే రాష్ట్రంలో ఎవరూ నిరుత్సాహం చెందరని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అన్ని సీట్లలో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, నారాయణపేటలో తట్టెడు మట్టికూడా ఎత్తలేదని విమర్శించారు. జిల్లా పోతే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామని ప్రజలు గుర్తించాలని కోరారు.
పట్టణంలో ఉన్న మాతృ, శిశు ఆస్పత్రిని కనీస వసతులు లేకుండా ఇక్కడి నుంచి తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మాతృ మరియు చిన్నపిల్లల ఆస్పత్రిని తిరిగి నారాయణపేటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను పట్టణ ప్రజలు గుర్తించి, మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.